Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్స్‌లో ‘నిమ్స్‌ న్యూరో అనిస్కాన్‌ 2026’ సదస్సు

నిమ్స్‌లో ‘నిమ్స్‌ న్యూరో అనిస్కాన్‌ 2026’ సదస్సు

- Advertisement -


నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘‘నిమ్స్‌ ‌న్యూరో అనిస్కాన్‌-2026’’ పేరుతో రెండ్రోజుల ప్రత్యేక శిక్షణా సదస్సు శనివారం నిమ్స్ ఎమర్జెన్సీ భవనం, ట్రామా ఆడిటోరియంలో ప్రారంభమైంది. న్యూరో-అనస్థీషియా వైద్యుల దృక్కోణంలో మెదడు, నాడీ వ్యవస్థ నిర్మాణం, దాని క్లినికల్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘న్యూరోఅనాటమీ ఫ్రమ్‌ ‌ది లెన్స్‌ ఆఫ్‌ ‌ది న్యూరో అనస్థిటిస్ట్‌’’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ హాజరై ప్రారంభించి మాట్లాడారు. న్యూరో సర్జరీల విజయవంతమైన నిర్వహణలో న్యూరో-అనస్థీషియా వైద్యుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. మెదడు నిర్మాణం, నాడీ వ్యవస్థ పనితీరుపై సమగ్ర అవగాహన కలిగి ఉండటం ద్వారా రోగులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించగలమని అన్నారు. న్యూరోఅనాటమీపై ప్రాయోగిక శిక్షణ అందించే ఇటువంటి కార్యక్రమాలు వైద్యులు, పీజీ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సదస్సు మొదటి రోజు మెదడు నిర్మాణం, సుప్రాటెంటోరియల్, ఇన్‌ఫ్రాటెంటోరియల్ భాగాలు, మెదడుకు రక్త సరఫరా వ్యవస్థ, న్యూరోఅనాటమీకి సంబంధించిన అంశాలపై నిపుణులు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం వెట్ డిసెక్షన్, లైవ్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా పాల్గొనే వారికి ప్రత్యక్ష శిక్షణ అందించారు. అలాగే సీటీ, ఎంఆర్ఐ చిత్రాల ఆధారంగా న్యూరోరేడియాలజీ అంశాలపై చర్చలు నిర్వహించారు. రెండో రోజు వివిధ న్యూరో సర్జికల్ కేసులపై కేస్ బేస్డ్ డిస్కషన్స్, ఇంట్రాక్రానియల్ అన్యూరిజమ్ తదితర అంశాలపై నిపుణుల చర్చలు, వర్క్‌షాప్ అనంతరం క్విజ్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ పి.చంద్రశేఖర్, అనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీలత మొనింగి, డాక్టర్ సప్నా ఏ. నిఖార్ , డాక్టర్ పద్మజ దుర్గ, శాస్త్రీయ కమిటీ సభ్యులు డాక్టర్ అబినాష్ పాత్రో, డాక్టర్ రామనాథ్, డాక్టర్ కె.శివప్రియ, డాక్టర్ ప్రాచి శర్మ, రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నుంచి అనస్థీషియాలజిస్టులు, పీజీ విద్యార్థులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -