బంగ్లా ఎన్నికలు హింసాత్మకం

Bangla Elections Violent– పలు ప్రాంతాల్లో ఘర్షణలు, కాల్పులు
– పలువురికి గాయాలు
– పోలింగ్‌కు ముందే అలజడి మొదలు
– 14 పోలింగ్‌ స్టేషన్లు, రెండు స్కూళ్లకు నిప్పు
– ఓట్ల లెక్కింపు ప్రారంభం.. నేడు ఫలితాలు
– ఎలక్షన్‌ను బహిష్కరించిన ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ
– ప్రధాని పీఠం మళ్లీ షేక్‌ హసీనాకే దక్కే అవకాశం
ఢాకా : బంగ్లాదేశ్‌లో 12వ సాధారణ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్‌కు ముందు, జరుగుతున్న సమయంలోనూ అలజడి వాతావరణం నెలకొన్నది. దీంతో అక్కడ అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదైంది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ఎన్నికలను బహిష్కరించటంతో ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం మొత్తం 300 స్థానాలకు గానూ 151 స్థానాలను దక్కించుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌ రోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, అభ్యర్థుల మద్దతుదారుల మధ్య ఘర్షణలు, కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనల్లో పలువురు గాయపడ్డారు. పోలింగ్‌ ప్రారంభం కావటానికి ముందు కొందరు 14 పోలింగ్‌ స్టేషన్లు, రెండు స్కూళ్లకు నిప్పంటించారు. బీఎన్‌పీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వటం, హింసాత్మక ఘటనల నేపథ్యంలో సాధారణ ఎన్నికల కోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద సాయుధ బలగాలు గస్తీ కాశాయి.ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత ఢాకాలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని షేక్‌ హసీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా కేవలం 27.15 శాతం పోలింగ్‌ నమోదైందని బంగ్లాదేశ్‌ ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల అవకతవకల నేపథ్యంలో ఏడు పోలింగ్‌ స్టేషన్లలో ఓటింగ్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మూడు కేంద్రాల్లో పోలింగ్‌ను మొత్తానికే రద్దు చేయటం గమనార్హం. ఛత్తోగ్రామ్‌, జమాల్‌పూర్‌, ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఢాకాలోని హజారీబాగ్‌లో ఒక పోలింగ్‌ స్టేషన్‌ సమీపంలో రెండు పెట్రోల్‌ బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు గాయపడ్డారు.
ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ ఇప్పటికే బహిష్కరించింది. ఈ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్‌ పార్టీ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా డమ్మీ క్యాండిడేట్లను నిలిపిందనీ, షేక్‌ హసీనా ఉండగా ఎన్నికలు సాఫీగా జరగబోవని బీఎన్‌పీ చీఫ్‌, మాజీ ప్రధాని ఖలేదా జియా ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఎన్నికలు జరగటంతో బంగ్లాదేశ్‌ ప్రధాని పీఠం మళ్లీ షేక్‌ హసీనాకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్‌ వరుసగా నాలుగోసారి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. అవామీ లీగ్‌ బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు ఐదు సార్లు అధికారాన్ని దక్కించుకున్న పార్టీగా నిలవనున్నది. బంగ్లాదేశ్‌లో మొత్తం 300 స్థానాలకుగానూ 299 సీట్లకు ఓటింగ్‌ జరిగింది. కొన్ని కారణాలతో ఒక స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల్లో 28 రాజకీయ పార్టీల నుంచి 1500 మంది, 436 మంది ఇండిపెండెంట్లతో మొత్తం 1970 మంది పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టినట్టు అధికారులు తెలిపారు. నేడు (సోమవారం) ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నదని ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 11.96 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా, ఎన్నికల కోసం 42 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు బంగ్లాదేశ్‌ ఎన్నికల సంఘం తెలిపింది.

Spread the love