గెలుపుకి మలుపుకి మధ్య

గెలుపుకి మలుపుకి మధ్యఇక్కడ మాటల కోటలు నిర్మించి
రంగులద్దాల్సిన పని లేదు
భుజం భుజం తట్టి
చిరునవ్వుని వెలిగించాల్సిన
అవసరం అసలే లేదు
కొన్ని నిర్ణయాల తిరుగుబాటులో
గెలుపుకి మలుపుకి మధ్య
స్వీకారాలు ఆకారాన్ని దాల్చుతుంటాయి

ఇక్కడ వాదానికి ప్రతివాదానికి
ముడి వేయాల్సిన ఆత్రుత లేదు
వాగ్ధానాల విసుర్లుకు
అక్కడక్కడా ఎగిరెగిరి పడుతూ
ఏ కొమ్మకో తగులుకోవాల్సిన పనే లేదు
గెలుపు మలుపుల మధ్య
కొన్ని సర్దుబాట్లు వాకిలి తడుతుంటాయి

ఇక్కడ అలంకారాలకు ఆనవాళ్లకు
తలొంచాల్సిన కర్మ లేదు
లోపలి మర్మాల మరమ్మతులకు
చేయి తడుపుల చేతలకు
ఏ తీరుకో కట్టుబడాల్సిన అవసరం లేదు
గెలుపు మలుపుల నడుమన
కొన్ని చేయూతలు చేయందిస్తుంటాయి

ఇక్కడ ఏ కారణాలు పడగలిప్పి
బుస కొట్టనక్కర్లేదు
ఒకటికొకటి కలుపుకుపోతూ
మరొక మార్గంలో పరుగులు పెడుతూ
ఆయాసాన్ని ఆవేశాన్ని కలపాల్సిన పని లేదు
గెలుపనే మలుపు మధ్యన
కొన్ని సంకల్పాలు పింఛం విప్పుతుంటాయి

ఇక్కడ ఏ ఆర్భాటాలు
డప్పులు మోగిస్తూ ఆడాల్సిన పని లేదు
పాదాల గుర్తుల్ని గడప గడపలో వదిలేస్తూ
చంకలెగరేయాల్సిన అవసరమే లేదు
గెలుపుకి మలుపుకి మధ్యన
కొంత నిశ్శబ్దం నిర్మాణాలుగా విస్తరిస్తూ
ఆకాశాన్ని తాకుతుంటాయి

గెలుపనేది
ఓర్పుకు ఓదార్పుకు మధ్య వారధి లాంటిది
గెలుపనేది
మనిషికి మానవతకు నడుమ
చెరగని గురుతు లాంటిది

– నరెద్దుల రాజారెడ్డి
9666016636

 

Spread the love