చూడాల్సిన సినిమా దేశం కోసం భగత్‌సింగ్‌

అమరవీరుడు, అసమాన త్యాగధనుడు, దార్శనికుడైన భగత్‌ సింగ్‌ జీవితంపై హిందీలో చాలా చిత్రాలు వచ్చాయి. ఇన్నేళ్లయినా తెలుగులో మాత్రం ఒక్క చిత్రం కూడా రాలేదు. ఆ లోటును పూడ్చుతూ రవీంద్రగోపాల తెలుగులో ”దేశం కోసం భగత్‌ సింగ్‌” పేరుతో ఒక పూర్తి నిడివి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ప్రీమియర్‌ షో మే 5న ఆదివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో దాశరధి థియేటర్స్‌ ఆధ్వర్యంలో జరిగింది. హిందీ సినిమాలకు ఏ విధంగానూ తీసిపోని రీతిలో ‘దేశం కోసం భగత్‌ సింగ్‌’ సినిమా ఉంది. భగత్‌ సింగ్‌ కేవలం విప్లవ వీరుడే కాదు. చిన్న వయస్సులోనే చాలా అధ్యయనం చేసినవాడు. మంచి రచయిత, జైల్లో ఉంటూనే ఆయన ఇంగ్లీష్‌, హిందీ పంజాబీ పత్రికలకు వ్యాసాలు పంపేవారు. రష్యాలో జయప్రదమైన సోషలిస్టు విప్లవం భగత్‌సింగ్‌కి చాలా ఉత్తేజమిచ్చింది. దానితో కమ్యూనిస్టు గ్రంథాలను ప్రపంచ పరిణామాలను ఆయన చాలా లోతుగా అధ్యయనం చేశారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలోని హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ పేరును హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అసోసియేషన్‌గా మార్చారు. ఆజాద్‌ కూడా అందుకు సమ్మతించారు. దేశం మతోన్మాదుల చేతుల్లో పడరాదని దేశ పౌరులను దాదాపు వందేళ్ళ క్రితమే హెచ్చరించాడు. భగత్‌ సింగ్‌ చిత్రానికి దర్శకుడు, పాటల రచయిత బాధ్యతలతో ప్రధాన పాత్రను కూడా రవీంద్ర గోపాల్‌ పోషించారు. ప్రముఖ నాటక రచయిత కంచర్ల సూర్యప్రకాశరావు రవీంద్ర కలిసి ఉమ్మడిగా సంభాషణలు రాశారు. ప్రిమియర్‌ షో సందర్భంగా దాశరథి ఫిల్ము సొసైటీ అధ్యక్షుడు ఎస్‌ఏకే మేనేజింగ్‌ సెక్రటరీ ఎస్‌. వినరు కుమార్‌, సొసైటీ కార్యదర్శి బిడిఎల్‌ సత్యనారాయణ, సొసైటీ సంయుక్త కార్యదర్శి భూపతి వెంకటేశ్వర్లు రవీంద్ర గోపాల్‌ను సన్మానించారు.

Spread the love