నా నాల్క మీద
నాట్యమాడు జ్ఞాన అచ్చరాలే అంబేద్కర్
నా చేతి వేళ్ళ సందున
మారుతున్న మకిలిరాత
తరతరాల వెలివేతను
కూల్చే వెలుగు పూత అంబేద్కర్
నా అడుగుల బడిమెట్లకు
ముండ్లు తగలని
తంగేడు పూల దారే అంబేద్కర్
నా మదిలో చిగురించే స్వేచ్ఛా ఆలోచనలకు
మోదుగుచెట్ల ఆయువు పట్టే అంబేద్కర్
హక్కుల దండోరా
నా ఒగ్గుడోలు గుండెచప్పుడు
డిల్లెం పల్లెమే అంబేద్కర్
నా కూటికుండలో
నా కోసం మిగులుతున్న
నాలుగు మెతుకులే అంబేద్కర్
అసమానపు సెగలు కక్కే
అహంకారపు సిగలు పట్టే సమాజానికీ
సల్లని సమతోడు నీడనిచ్చే
రావి చెట్టే అంబేద్కర్
ఆ మనువు కుక్క చేసిన గాయాలను
మాన్పే మందే అంబేద్కర్
ఎట్టిజనులను ఏకం చేసి
శోకం బాపిన మట్టి మనిషే అంబేద్కర్
నాయినకు కన్ను –
అమ్మకు మన్ను
నాకు పెన్ను –
దేశానికి వెన్ను
ముమ్మాటికీ అంబేద్కర్
నా ఎదల మీద ఎగురుతున్న
ఆత్మ గౌరవ జెండా
నల్ల గొంగడే అంబేద్కర్
పుట్టమన్ను గద్దెల మీద
ఆది వీరనాగు చరితకు
స్వేద నాదమే అంబేద్కర్
నాకు, నా ఎలకోటి మందకు
భీమరక్షే అంబేద్కర్
అంబేద్కర్, అంబేద్కర్,
అంబేద్కర్
– చిక్కొండ్ర రవి