– ఎమ్మెల్యే రఘునందన్‌రావును నిలదీసిన యువత
– తన్నండని గ్రామస్తులపైకి కార్యకర్తలను ఉసిగొల్పిన ఎమ్మెల్యే
నవతెలంగాణ- చేగుంట
మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావును ఎన్నికల ప్రచారంలో మంగళవారం స్థానికులు నిలదీశారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సమస్యలపై యువకులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచార రథంపై మాట్లాడుతున్న సందర్భంలో.. దళిత యువకులు కొలుపుల దినేష్,
ప్రభాకర్ అభ్యంతరం చెప్పారు. ‘రుక్మాపూర్‌లో సర్వేనెంబర్ 104, 107లో పోడు భూముల పట్టాలు ఇప్పిస్తానని ఉప ఎన్నికలలో హామీ ఇచ్చారు. అది ఏమైంది’ అని ప్రశ్నించారు. అయితే, సహనం కోల్పోఇయన ఎమ్మెల్యే వారిని తన్నండని నాయకులను పురమాయించారు. దీంతో కొందరు గ్రామస్తులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు దినేష్‌ను అదుపులోకి తీసుకుని.. ఇరువురినీ చెదరగొట్టారు. హామీలపై ప్రశ్నిస్తే బీజేపీ నాయకులు తనపై దాడి చేశారని యువకుడు దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ చెరువులో పడి ముగ్గురు చనిపోతే ఎమ్మెల్యే కనీసం పరామర్శించడానికి రాలేదని, ఉప ఎన్నికల్లో రుక్మాపూర్ గ్రామానికి వచ్చినప్పుడు పోడు భూములకు తప్పకుండా పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి తర్వాత ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.