బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి

Harish Rao– ప్రధాని ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారు?
– కాంగ్రెస్‌ నేతలవి జూటా మాటలు
– ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
– మరిపెడ, నర్సంపేట, ములుగులో పర్యటన
నవతెలంగాణ – మరిపెడ/నర్సంపేట/ములుగు
మోటార్లకు మీటర్లు పెడతామని రైతును ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఏ మొఖం పెట్టుకొని ప్రధాని మహబూబ్‌ నగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని తెలిపారు. గురువారం వరంగల్‌, ములుగు మహబూబాబాద్‌ జిల్లాల్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.డోర్నకల్‌ నియోజ కవర్గంలోని మరిపెడలో తొర్రూరు, మరిపెడ 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాలకు, వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ప్రభుత్వం ఇటీివల రూ.183 కోట్లతో మంజూరు చేసిన వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. వైద్య కళాశాల నిర్మాణ పనులకు, 33/11 కేవి సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.21.27లక్షలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ (ఎస్‌ఎన్సియూ) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక్కొక్క 100 పడకల ఆస్పత్రిని సుమారు రూ.36 కోట్లతో నిర్మించనున్నామని, ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 40 మంది డాక్టర్లు రానున్నట్టు తెలిపారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలో రూ.1100 కోట్లతో 24 అంతస్థుల్లో 2వేల పడకలతో హెల్త్‌ సిటీ నిర్మిస్తున్నామన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ రాష్ట్రానికి రాకపోవడం బాధాకరమన్నారు. సీట్లు అమ్ముకొనే వారు రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నే అమ్ముతారని విమర్శించారు. కాంగ్రెస్‌ పింఛన్‌లను రూ.4వేలకు పెంచుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు దేశం మొత్తం మీద ఒక పాలసీ ఉండాలి కాదా ? ఒక్క తెలంగాణలో మాత్రమే రూ.4వేలు పింఛన్‌ ఇస్తామని చెబితే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ ఈ తొమ్మిదేండ్లలో సస్యశ్యామలం చేశారని చెప్పారు. సాగు నీటి రంగంలోనే కాదు విద్య, వైద్య రంగాల్లోనూ అనూహ్యమైన మార్పులతో పేద విద్యార్థుల ముంగిటకు ఉచిత చదువులు తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వమన్నారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి లక్ష మందికి 22 మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లు ఉండేలా చేస్తున్నామన్నారు.
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో గోదావరి నీళ్లు తెచ్చి సాగు నీరు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను నిండు మనస్సుతో మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్త చేశారు. నగర పంచాయతీగా ఉన్న ములుగు ప్రాంతం నేడు జిల్లా కేంద్రంగా ఏర్పడిందని, సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ భవనం, వైద్య కళాశాలతో ములుగు రూపు రేఖలు మారనున్నాయని చెప్పారు. అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, దళిత బంధు, గృహలక్ష్మీ పథకం మంజూరు పత్రాలను మంత్రి లబ్దిదారులకు అందజేశారు.
కేంద్రం చేసిందేమీ లేదు : కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పీటీఐ వార్తా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను తిరస్కరిస్తారని తెలిపారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమని లేదని తెలిపారు. కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు, ఆ పార్టీ మాటలు నమ్మశక్యంగా లేవని తెలిపారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love