ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంటే
సేకరణ లక్ష్యాన్ని కుదిస్తారా ?
ఇది తీరని అన్యాయం
కేంద్రంపై మంత్రి పొన్నం ఘాటు విమర్శ
తుమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్ర సీఎంను
ఒప్పించాలంటూ రాష్ర్ట నేతలకు సవాల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రైతులు దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రైతుల పట్ల వివక్ష చూపుతూ ధాన్యం సేకరణ లక్ష్యాలను కుదించడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలనే సంకల్పంతో ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తుంటే, కేంద్రం మాత్రం రైతులను నిరాశపరుస్తోందని తెలిపారు. 2025-26 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 67.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.12,375 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి చెప్పారు. దీంతో 10 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారని గుర్తు చేశారు. అకాల వర్షాలతో తడిసిన 10,215 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 8575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదని పేర్కొన్నారు. యాసంగిలో తెలంగాణలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే , కేంద్రం కేవలం 52 లక్షల టన్నులు, అంటే 37 శాతానికి పరిమితం చేసిందని తెలిపారు. మరోవైపు పంజాబ్‌కు 86 శాతం, ఛత్తీస్‌గఢ్‌కు 67 శాతం, హర్యానాకు 65 శాతం, ఒడిశాకు 52 శాతం సేకరణ లక్ష్యాలు కేటాయించిన కేంద్రం, తెలంగాణకు మాత్రం కేవలం 37 శాతం మాత్రమే కేటాయించడం పట్ల బీజేపీ చేస్తున్న వివక్షను ప్రశ్నించారు.
గత ప్రభుత్వం పదేండ్ల కాలంలో ధాన్యం కొనుగోళ్లకు రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ప్రజా ప్రభుత్వం కేవలం రెండేండ్లల్లోనే రూ.84 వేల కోట్లను రైతుల కోసం ఖర్చు చేసి సగటున ఏడాదికి రూ.42 వేల కోట్లను రైతుల కోసం వెచ్చించడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని చెప్పారు. కొనుగోళ్ల బాధ్యత మొత్తం రాష్ట్రాలపై వేసి భారం మోపుతోందన్నారు.మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2,400 చెల్లిస్తూ ఇప్పటికే రూ.1172 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామననీ , జొన్నలను క్వింటాల్‌కు రూ.3699 చొప్పున కొనుగోలు చేసి రూ.350 కోట్లను రైతులకు చెల్లిస్తే ఇందులో కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం సరకాదన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ధాన్యం సీలింగ్‌ను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్రంలో పండిన ధాన్యంలో కనీసం 70 శాతం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కేంద్రం,
రాష్ట్ర బీజేపీ నేతల నిర్లక్ష్యం
ఉత్తర తెలంగాణ రైతుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నదనీ, ప్రభుత్వంతో చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసినా స్పందన మంత్రి చెప్పారు . ఇటీవల గత నెల ఆరో తేదీన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మే 25న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందించలేదనీ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదనీ మంత్రి పొన్నం ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు ఒత్తిడి తేవడం లేదన్నారు. తెలంగాణ రైతులకు రావాల్సిన నీటి హక్కుల విషయంలో బీజేపీ మౌనం వీడాలని సూచించారు. ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులపై బీజేపీ వివక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



