పవన్‌కళ్యాణ్ ఓ అపరిచితుడు
ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ అపరిచితుడనీ, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై అంత రాద్ధాంతం చేయడం అంత అవసరమా? అని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక దాగి ఉన్న అజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరో వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను పెద్దదిగా చేసి, రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణలో పర్యటించడాన్ని, ఎన్నికల్లో పోటీచేయడాన్ని తాము అడ్డం చెప్పట్లేదనీ, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కమ్యూనిజం చచ్చిపోయిందంటూ వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఎవరి మెప్పు కోసం ఆ వ్యాఖ్యలు? అని ప్రశ్నించారు. మా నాన్న కమ్యూనిస్టు, మాది కమ్యూనిస్టు కుటుంబం అని చెప్పి..ఇప్పుడు పదవీకాంక్షతో ఏదైనా చేస్తావా? అని నిలదీశారు. జనసేన పార్టీ ఒకటి రెండు ఎన్నికల వరకు ఉంటుందేమో గానీ, ఎప్పటికీ కమ్యూనిస్టు భావజాలం సజీవంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల బాధలకు స్పందించి ప్రశ్నించే ప్రతి మనిషిలో కమ్యూనిస్టు ఆలోచన ఉంటుందని, ప్రశ్నకు మూలం కమ్యూనిజమేనని చెప్పారు. గద్దర్‌కు తానే కారు కొనిచ్చానంటూ పవన్‌కళ్యాణ్ ప్రచారం చేసుకోవడం సరిగాదని సూచించారు. ప్రజల ప్రేమాభిమానాలే గద్దర్‌ను నిలబెట్టాయని చెప్పారు.
నేడు బషీర్‌బాగ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌పై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు కూనంనేని ప్రకటించారు. అందులో మేధావులు, ప్రొఫెసర్లు, పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులు పాల్గొంటారని తెలిపారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఈ సమస్య ఉత్పన్నం కాకుండా వైషమ్యాలకు ముగింపు పలకాలనేదే ఈ సమావేశం ఉద్దేశమన్నారు. అధిక ధరలను నిరసిస్తూ ఈ నెల10న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తామన్నారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు 45 నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 28న వేలాది మందితో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు.
కమ్యూనిస్టు భావజాలం ఎప్పటికీ సజీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



