సెన్సెక్ 1312 పాయింట్ల పతనం
రూ.6.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : బంగారం దిగుమతులు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. విదేశీ మారకం నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని.. కొద్ది కాలం ప్రజలు పసిడి కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోడీ ప్రకటనతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో దలాల్ స్ర్టీట్ గత మార్చి నెల తర్వాత అత్యంత దారుణమైన పతనాన్ని చవి చూసింది. ఈ నేపథ్యంలోనే ఒక్క పూటలోనే రూ.6.4 లక్షల కోట్ల పైగా ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 1,312 పాయింట్లు లేదా 1.70 శాతం నష్టంతో 76,015కు పరిమితమయ్యింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 377 పాయింట్లు లేదా 1.57 శాతం క్షీణించి 23,815.85 వద్ద ముగిసింది.
అమెరికా ఏకపక్ష శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడం, దానికి ప్రతిస్పందనగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుపై ప్రభావం చూపుతుందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనికి తోడు పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాలని, బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోడీ చేసిన విజ్ఞప్తి దేశ ఆర్థిక పరిస్థితిపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. రంగాల వారీగా రియల్టీ అత్యధికంగా 3 శాతం, కన్స్యూమర్ డ్యూరెబుల్స్ 3.7 శాతం, పిఎస్‌యు బ్యాకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా దాదాపు 1 శాతం మేర పడిపోయాయి. ముఖ్యంగా కళ్యాణ్ జువెలర్స్, స్విగ్గీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటి ప్రధాన షేర్లు అధిక నష్టాలు చవి చూశాయి.
దలాల్ స్ట్రీట్‌కు బ్లాక్ మండే
- Advertisement -
- Advertisement -


