– మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీ మధ్య తాయిలాల పోటీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తూ, ప్రధాని మోడీ, కాంగ్రెస్ జనరల్ సెక్రెట రీ ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో.. వేర్వేరు ప్రదేశాల్లో ర్యాలీలలో ప్రసంగించారు . ఒక పార్టీపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. ఇటీవల ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ, మధ్యప్రదేశ్‌లో మహిళల కోసం కాంగ్రెస్ సమగ్ర ”సురక్షా చక్ర” పథకాన్ని కలిగి ఉందని అన్నారు.
ఆడపిల్ల పుడితే కుటుంబానికి రూ.2.5 లక్షలు, పాఠశాలకు వెళ్లే బాలికలకు రూ.500 నుంచి రూ.1500 వరకు ఆర్థిక సహాయం, ఆడపిల్ల పెళ్లికి రూ.1.1 లక్షలు అందజేస్తామని తెలిపారు. ప్రతి మహిళా కుటుంబానికి రూ.1500, సీనియర్ సిటిజన్ మహిళలకు రూ.1200 వద్ధాప్య పింఛను అందజేస్తామని ప్రకటించారు.
తాను ప్రభుత్వాన్ని కాదు కుటుంబాన్ని నడుపుతున్నానని ఇటీవల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘నా సోదరీమణులను లక్షాధికారులను చేస్తాను. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి మహిళకు నెలవారీగా డబ్బు అందజేస్తోంది. కానీ క్రమంగా మొత్తం పెరుగుతుంది. నేను తమాషా చేయడం లేదు. ఇది నా దృక్కోణం. ”
అని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రకారం, మధ్యప్రదేశ్‌లో మొత్తం జనాభాలో మహిళలు 47.8 శాతం ఉండగా, పురుషులు 52.1 శాతం ఉన్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లలో 52 సీట్లలో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు కనీసం 10 స్థానాల్లో ఆధిపత్యం చెలాయించినట్టు నివేదిక పేర్కొంది.
బీజేపీ కూడా పథకాలతో..
రాష్ట్రంలో మహిళల కోసం పార్టీ ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చౌహాన్ అనేక పథకాలను ప్రవేశపెట్టారు, ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలలో (అటవీ శాఖ మినహా) మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు , వారికి 50 శాతం ఉపాధ్యాయ పోస్టులను కేటాయించారు.
లాడ్లీ బెహనా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.1,250 చొప్పున అందజేస్తుంది. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం , ఆడ భ్రూణహత్యలు , బాల్య వివాహాలను నిరోధించడం లాడ్లీ లక్ష్మి యోజన లక్ష్యం. గత నెలలో చౌహాన్ మాట్లాడుతూ, ”గర్భంలో ఆడపిల్లలు చంపబడ్డారు, కాబట్టి మేం బాలికల కోసం ముఖ్యమంత్రి లాడ్లీ లక్ష్మి యోజనను చేసాం, ఇప్పుడు, మధ్యప్రదేశ్‌లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 956 మంది ఆడపిల్లలు పుడుతున్నారు.” అని వివరించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన , ముఖ్యమంత్రి లాడ్లీ బ్రాహ్మణ యోజన కింద 450 రూపాయల రాయితీపై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను సెప్టెంబర్ 1 నుంచి అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద ,లాడ్లీ బ్రాహ్మణ యోజన కింద రిజిస్టర్ చేసుకున్న ప్రధాన్ మంత్రియేతర ఉజ్జ్వల యోజన కేటగిరీకి చెందిన వినియోగదారులందరూ వారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
కాంగ్రెస్ వాగ్దానాలు..
అక్టోబర్‌లో పార్టీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది, రాష్ట్రంలోని మహిళల కోసం అనేక ఎన్నికల వాగ్దానాలు చేసింది. నారీ సమ్మాన్ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 సాయం అందిస్తామన్నది.
500కే ఎల్‌పీజీ సిలిండర్ అంద జేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వివా హాలకు పార్టీ రూ.1.01 లక్షల సాయం అందజేస్తుంది. స్టార్టప్‌లకు 3 శాతం వడ్డీ రేటుతో రూ.25 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉంచబడతాయి.ఇది గ్రామీణ నిరాశ్రయులైన మహిళలకు గహనిర్మాణం ,మెట్రో పాలిటన్ బస్సు సర్వీసుల్లో ఉచిత రవాణాను కూడా వాగ్దానం చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే ‘మేరి బిత్యా రాణి’ని ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలో పుట్టిన ప్రతి కూతురికి పుట్టినప్పటి నుంచి పెండ్లి వరకు రూ.2.51 లక్షలు అందజేస్తారు.