ఆకాశం నిప్పుల వాన కురిపిస్తుంది
మృత్యువు వికటాట్టహాసం చేస్తుంది
నేల నలుదిక్కుల నెత్తురు చిమ్ముతుంది
నెనరు లేని ఆకాశం రక్త వర్ణంలో
మరో రోజుకు పురుడు పోస్తుంది
పసి మొగ్గలు అర్ధాంతరంగా
అంతర్ధానమవుతాయి
రెక్క విరిగిన తెల్ల పావురం
నిశ్శబ్దంగా కన్నీటి చుక్క విడుస్తుంది
మృత్యు శిశిరం మరో ఆకు రాలుస్తుంది
ఆయుధాలు రాజకీయాలని నిర్ణయిస్తాయి
వాణిజ్యం యుద్ధాల్ని ఎగుమతి చేస్తాయి
లాభాలు భావజాలానికి దర్శకత్వం వహిస్తాయి
శిఖరాగ్ర సమావేశాల్లో రెండు క్షిపణులు
చిరునవ్వులతో కరచాలనం చేసుకుంటాయి
మరో రెండు యుద్ధ ట్యాంకులు
పశ్చిమాసియాలో శాంతి కోసం పరితపిస్తాయి
రహస్యంగా మరో యుద్ధానికి
ఒప్పందం జరిగిపోతుంది
ఆయుధ కాంట్రాక్టు పత్రాలపై
చేసిన సంతకాల సిరా ఆరకముందే
రెండు ఆసుపత్రులు నేలమట్టమవుతాయి
మరుక్షణం మరో రెండు స్కూళ్లు
బూడిద కుప్పలౌతాయి
పసిపిల్లలు అనాధలవుతారు
ప్రపంచం కన్నీటితో నివాళులర్పిస్తుంది
మానవత్వ హననానికి ప్రపంచ పెట్టుబడి
ఐక్యరాజ్యసమితి సాక్షిగా మరోసారి
ప్రతిన బూనుతుంది
– టి.హరికృష్ణ, 9494037288