– పలు దేశాలలో వస్తు బహిష్కరణలు
వాషింగ్టన్ : ఒక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య భాగస్వాములపై ప్రతీకార సుంకాలు విధించి సంబరపడుతుంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా వస్తువుల బహిష్కరణ కొనసాగుతోంది. ‘బాయ్ కాట్ అమెరికా’ పేరుతో సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లలో పుంఖానుపుంఖాలుగా సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా బ్రాండ్లు, ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దంటూ నెటిజన్లు విజ్ఞాపనలు పంపుతున్నారు. సుంకాల ను ట్రంప్ ప్రకటించకముందే ఐర్లాండ్‌లోని డూన్‌బెగ్‌లో, స్కాట్‌లాండ్‌లోని టర్న్‌బెర్రీలో ఉన్న అధ్యక్షుడి గోల్ఫ్ కోర్టుల వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. కెనడాలో వ్యాపారులు అమెరికా వస్తువులను విక్రయించడం ఆపేశారు. ఇక ట్రంప్ సన్నిహితుడు ఎలన్ మస్క్‌పై కూడా ప్రజాగ్రహం అమెరికాతో సహా పలు దేశాల్లో పెల్లుబుకుతోంది. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని టెస్లా కార్ షోరూముల వద్ద నిరసనలు జరిగాయి.జర్మనీ వంటి కొన్ని చోట్ల ఆందోళనకా రులు కార్లకు నిప్పు పెట్టారు. కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మొత్తం గా చూస్తే ట్రంప్, మస్క్ బ్రాండ్ల బహిష్కరణ ఊపందుకుంటోంది. డెన్మార్క్‌లోని అతి పెద్ద వ్యాపార సంస్థ సాలింగ్ గ్రూప్ యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులన్నింటి పైన ధరల లేబుల్ ముద్రించింది. దీంతో వినియోగదారులు అమెరికా వస్తువుల వైపు చూడడం లేదు. గ్రీన్‌లాండ్‌లోని దుకాణదారులు టెస్లా, నెట్‌ఫ్లిక్స్, కోకా-కోలా వంటి అమెరికా ఉత్పత్తులు, సేవలను బహిష్కరించారు. సూపర్ మార్కెట్లలో దేశీయ ఉత్పత్తులు బాగా కనిపించేలా ఏర్పాటు చేశారు. స్థానిక వస్తువుల కొనుగోలులో సెల్‌ఫోన్ యాప్స్ వినియోగదారులకు సహకరిస్తున్నాయి. అమెరికా వస్తువులు, సేవలను ఎలా వదిలించుకోవాలో తెలియజేసేందుకు ఫేస్‌బుక్ గ్రూపులను ఏర్పాటు చేశారు. గత నెలలో ఏర్పాటు చేసిన ఈ గ్రూపులలో ఇప్పటికే వేలాదిగా సభ్యులు చేరారు. ‘మేము అమెరికాను, దాని సంస్కృతిని ప్రేమిస్తాము. కానీ అధ్యక్షుడిని ఇష్టపడము’ అని ఓ ఫేస్‌బుక్ గ్రూప్ సహ అడ్మినిస్ట్రేటర్ వ్యాఖ్యానించారు. డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్ పట్ల ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను ఈ గ్రూపులు వినియోగదారుల కు సూచిస్తున్నాయి. స్థానికంగా తయారవుతున్న సాఫ్ట్ డ్రింకులు, పాదరక్షలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. అమెరికా కంపెనీలు, ఉత్పత్తులను బహిష్కరించిన కెనడాను అనేక మంది ఆదర్శంగా తీసుకొంటున్నారు. ఒకప్పుడు అమెరికాకు డెన్మార్మ్ చాలా సన్నిహితంగా ఉండేది. అలాంటి దేశం ఇప్పుడు ట్రంప్ పేరెత్తితేనే మండిపడుతోంది. ట్రంప్ ప్రభుత్వంపై మరింత బలంగా పోరాడాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్‌లాండ్ తమదేనంటూ ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలపై ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న దుందుడుకు విదేశీ విధానాలపై మండిపడుతున్నారు. అమెజాన్ సబ్‌స్క్రిప్షన్లను, కాలిఫోర్నియా వైన్స్‌ను వారు బహిష్కరించారు. అమెరికా ఉత్పత్తులపైన కోకా-కోలా, ప్రింగిల్స్‌కు స్థానిక ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. కెనడాలో వ్యాపారులు వినూత్నంగా తమ షాపులలో అమెరికా వస్తువులను తలకిందులుగా ఉంచుతున్నారు. వినియోగదారులు అమెరికా వస్తువులను సులభంగా గుర్తు పట్టేందుకు వారు ఈ ఎత్తుగడ వేశారు. అయితే కొన్ని దేశాలలో దుకాణాలలో అమ్మకానికి ఉంచుతున్న బ్రాండ్లు ఏ దేశానికి చెందినవో అర్థం కాక వినియోగదారులు తికమక పడుతున్నారు. ఉదాహరణకు బ్రిటన్‌లో విక్రయించే కాడ్బరీ, వాటర్‌స్టోన్స్, బూట్స్ వాస్తవానికి అమెరికా బ్రాండ్లే. కాగా కొన్ని దేశాలలో వినియోగదారులు అమెరికా వస్తువులకు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. యూరప్‌లో కూడా అమెరికా వస్తువుల బహిష్కరణ ఊపందుకుంటోంది. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సహా పలు దేశాలలో పెద్ద ఎత్తున బహిష్కరణలు కొనసాగుతున్నాయి.