‘బాయ్ కాట్‌ ఎలక్షన్స్‌’

య్– ఢిల్లీ యూనివర్సిటీ గోడలపై నినాదాలు స్ప్రే
– తమ పనేనన్న బీఎస్‌సీఈఎం
– రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు.. దర్యాప్తు షురూ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు కలకలం చోటు చేసుకున్నది. ఢిల్లీ యూనివర్శిటీ ప్రాంతంలో ఎన్నికలను బహిష్కరించాలంటూ, నక్సలిజాన్ని ప్రశంసిస్తూ కొన్ని నినాదాలు గోడలపై స్ప్రే చేసి కనబడ్డాయి. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గురువారం ఉదయం పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో రాసిన నినాదాలను గమనించినట్టు పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ గోడలు, పోలీసు బారికేడ్లపై ‘బాయ్కాట్‌ ఎలక్షన్స్‌, జాయిన్‌ న్యూ డెమోక్రసీ (ఎన్నికలు బహిష్కరించండి, కొత్త ప్రజాస్వామ్యంలో చేరండి)’, ‘లాంగ్‌ లివ్‌ నక్సల్బరీ’ వంటి నినాదాల రాతలు కనిపించాయి. కాగా, స్వయం ప్రకటిత యువజన సంస్థ భగత్‌ సింగ్‌ ఛత్ర ఏక్తా మంచ్‌(బీఎస్‌సీఈఎం) ఈ నినాదాలకు బాధ్యత వహించింది. యూనివర్సిటీ గోడలపై స్ప్రే చేసిన నినాదాల ఫొటోలను బీఎస్‌సీఈఎం తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ఆస్తి పరువు నష్టం నిరోధక చట్టం కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఢిల్లీలోని మొత్తం ఏడు పార్లమెంట్‌ స్థానాల్లో లోక్‌సభ ఎన్నికలు నేడు జరగనున్నాయి. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడన్నాయి.

Spread the love