Friday, July 17, 2026
E-PAPER
Homeజాతీయంఉపాధి ఉద్యోగులపై విరిగిన లాఠీ

ఉపాధి ఉద్యోగులపై విరిగిన లాఠీ

- Advertisement -

జలంధర్: తమ సర్వీసులను క్రమబద్ధీకరిం చాలని, ఎనిమిది నెలల బకాయి జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉద్యోగులు.. బుధవారం ఖన్నాప్రాంతంలో చేపట్టిన నిరసన ఉద్రికత్తలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేసుకుంటూ.. పంజాబ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీల శాఖ మంత్రి తరుణ్‌ప్రీత్ సింగ్ సోంద్ నివాసం వైపు ఉద్యోగులు దూసుకురాగా, వారిని అడ్డుకోవడానికి పోలీసులు రెచ్చిపోయారు. లాఠీచార్జి, టియర్‌గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పోలీసుల వీరంగంతో.. 10 మంది ఉద్యోగులు గాయపడ్డారు. వారిని ఖన్నా సివిల్ ఆస్పత్రి,తో పాటు పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో చేర్చారు. ఈ ఘర్షణలో ఖన్నా డీఎస్పీ వినోద్ కుమార్ సహా పలువురు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.

ఏం జరిగింది..?
ప్రేమ్ భండారీ పార్కులో తమ హక్కులకోసం గుమిగూడారు. 2,000 మందికి పైగా కాంట్రాక్టు ఎంజీఎన్ఆర్ఈజీఏ సిబ్బందిని గ్రామీణాభివృద్ధి , పంచాయతీల శాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని, అలాగే గత ఎనిమిది నెలలుగా బకాయి ఉన్న జీతాలను విడుదల చేయాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని సమర్పించడానికి అమ్లోహ్ రోడ్డులోని మంత్రి నివాసం వైపు ప్రదర్శనగా వెళ్లారు. మంత్రి నివాసం సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు వాటిని దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో, పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు, నీటి ఫిరంగులతో గుంపును చెదరగొట్టారు. ఈ నిరసనకు మద్దతు తెలిపిన పెండూ మజ్దూర్ యూనియన్.. పోలీసుల చర్యను ఖండించింది. నిరసనకారులు శాంతియుతంగా తమ వినతిపత్రాన్ని సమర్పించేందుకు వెళ్తుండగా వారిని అడ్డుకుని, దాడి చేశారని రాష్ట్ర అధ్యక్షుడు తర్సెమ్ పీటర్ ఆరోపించారు. ఘర్షణ సమయంలో పలువురు మహిళా నిరసనకారులు గాయపడ్డారని, పోలీసులు వారిని దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.

ఫతేగఢ్ సాహిబ్ నివాసి అయిన సుదాగర్ సింగ్‌కు రెండు కాళ్లు విరిగాయని, గాయాల తీవ్రత దృష్ట్యా అతడిని మొహాలీలోని ఆస్ప త్రికి తరలించినట్టు యూనియన్ తెలిపింది. గాయపడిన కార్మికులందరికీ పంజాబ్ ప్రభుత్వం ఉచిత వైద్య చికిత్సతో పాటు నష్టపరిహారం అందించాలని తర్సెమ్ పీటర్ డిమాండ్ చేశారు. నిరసన అనంతరం జరిగిన మరో ఘటనలో, ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్మికులను వారి గ్రామాలకు తిరిగి తీసుకువెళ్తున్న ఒక క్యాంటర్, బీజా గ్రామం సమీపంలో మరో వాహనాన్ని ఎదురెదురుగా ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో సుఖ్‌దేవ్ సింగ్ అనే కార్మికుడు మరణించగా, పలువురు గాయపడి సమీపంలోని ఆస్పత్రులలో చేరారు.

పంజాబ్‌ పోలీసుల దమనకాండను 
ఖండించిన సీపీఐ(ఎం)
ఖన్నా (పంజాబ్‌) : పెండింగ్‌‌ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గ్రామీణ ఉపాధి రంగాన్ని కాపాడాలని కోరుతూ పంజాబ్‌‌లోని ఖన్నాలో బుధవారం ఆందోళన నిర్వహించిన ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ (మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉద్యోగులు, గ్రామీణ కార్మికులపై పంజాబ్‌ ‌ప్రభుత్వం దమనకాండకు దిగింది. తొలుత బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. తరువాత లాఠీ చార్జి చేశారు. పోలీసుల దాడిలో మహిళలతో సహా పలువురు గాయపడ్డారు. ‌ఖన్నాలో పంచాయితీ శాఖ మంత్రి తరుణ్‌‌ప్రీత్‌ సింగ్‌ సాంద్‌ నివాసం వద్దకు ప్రదర్శనగా వెళుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. 23 జిల్లాలు, దాదాపు 250 బ్లాకుల నుండి వచ్చిన కార్మికులు ప్రేమ్‌ ‌భండారీ పార్క్‌ ‌వద్ద ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధానాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ ‌చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం, వారిని నిలువరించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించింది. మంత్రి నివాసం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసింది.

ప్రజాస్వామ్య హక్కులపై దాడి : సీపీఐ(ఎం)
పోలీసుల దాడులను సిపిఎం పంజాబ్‌ ‌శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య హక్కులపై, కార్మికుల పోరాటాలపై జరిగిన దాడి అని విమర్శించింది. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడిగిన ఉద్యోగులు, కార్మికులపై ఇలా బలప్రయోగానికి దిగడం పాలకుల నిరంకుశ ధోరణిని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. కార్మికులు, ఉద్యోగులకు సీపీఐ(ఎం) సంఘీభావం ప్రకటించింది. తక్షణమే పెండింగ్‌‌లోని వేతనాలు, ఇతర ప్రయోజనాలు విడుదల చేయాలని కోరింది. ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరిచుకోవాలని కోరింది. వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి కార్మిక సంఘాలతో అర్ధవంతమైన చర్చలు జరపాలని కోరింది.

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
ప్రశాంతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వారిపై పోలీసుల దమనకాండను యూనియన్‌ ‌నాయకులు ఖండించారు. పంజాబ్‌లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కింద దాదాపు రెండు దశాబ్దాలుగా ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి అనేక నెలలుగా వేతనాలు పెండింగ్‌‌లో వున్నాయని తెలిపారు. రెగ్యులర్‌ ఉపాధి లేకుండానే వారు తమ పనులు కొనసాగిస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని యూనియన్ల నేతలు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -