– పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి
– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట: అలవికాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనం ప్రస్తుతం వారు నిర్వహించే ప్రజాపాలన గ్రామసభల్లో నే తేటతెల్లం అవుతుందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల జయాపజయాలు పై సమీక్షించేందుకు స్థానిక సత్య సాయి కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల స్థాయి ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి అద్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోటములు సహజం అని, ప్రజా తీర్పును గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి చేస్తే ఆహ్వానించాలి అని, అదే క్రమంలో ప్రజలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షంగా ప్రతిఘటించడం అనివార్యం అని తెలిపారు.
ముందుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు గతంలో మనం చేసిన అభివృద్ధిని తెలుపుతూ, అధికార పక్షం అమలు చేసే పథకాలను ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి యు.ఎస్ ప్రకాశ్ రావు,ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి, గుర్రాల చెరువు, మల్లాయిగూడెం, ఊట్లపల్లి, వేదాంతపురం సర్పంచ్ లు దుర్గయ్య, రాజశేఖర్, జ్యోత్స్న భాయి, శివశంకర్ ప్రసాద్, సోయగం వీరభద్రం, వగ్గెల పూజ, కాసాని చంద్రమోహన్, సంక ప్రసాద్ రావు, తాడేపల్లి రవి, మందపాటి రాజమోహన్ రెడ్డి, చందా లక్ష్మి నర్సయ్య, చిన్నం శెట్టి వెంకట నరసింహం, గుడవర్తి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.