నవతెలంగాణ – అశ్వారావుపేట
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై హత్యకు కుట్ర జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అశ్వారావుపేట మండల కో-ఆర్డినేటర్ జూపల్లి కోదండ వెంకట రమణరావు, మండల నాయకులు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సెప్టెంబర్ 8 న ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద చోటుచేసుకున్న పరిణామాల పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. పెద్ద సంఖ్యలో వాహనాలతో కొందరు వ్యక్తులు ఫామ్ హౌస్ వద్దకు వెళ్లడం, అనంతరం కేసీఆర్ కు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియా, టీవీ మాధ్యమాల్లో రావడం వంటి అంశాలను పరిశీలించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు ఇతరుల పాత్రపై విచారణ జరిపి, బాధ్యులపై హత్యాయత్నం సహా తగిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ భద్రతకు ముప్పు కలిగించే ఘటనలపై ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించాలని కోరారు.
ఫిర్యాదు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి యూ ఎస్ ప్రకాష్ రావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సంక ప్రసాద్, సొసైటీ మాజీ డైరెక్టర్ కలపాల బాబురావు, మాజీ సర్పంచ్ నారం రాజ శేఖర్, మండల నాయకులు మందపాటి మోహన్‌రెడ్డి, చిప్పనపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.



