– టీపీసీసీ సభ్యురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ సభ్యురాలు, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని బీసీ, వంపు తండాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆమె కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కొట్లాడి సాదించుకున్న స్వరాష్ట్రంలో నియామకాలు, జీతాల కోసం ప్రాణాలర్పించాల్సిని దుస్తితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ మూడు నెలల కాలంలో ఎంతో కీలకమని, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రంగు మురళీ గౌడ్, మండల నాయకులు కనుకుంట్ల నరేష్, పన్నీరు వేణు తదితరులు పాల్గొన్నారు.