నవతెలంగాణ – హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు జూల వంశీ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని మండలం, గడిడల గాంధీ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30 నుంచి కనిపించకుండా పోయిన వంశీ, హైదరాబాద్‌లో ఒక యువతిని కలవడానికి వెళ్లినట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ యువతి భర్త ఆమెను హైదరాబాద్‌కు పిలిపించి, పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగిరెడ్డిపల్లికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత క్రమంలో ఆమె వేరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు తెలిసింది. కాగా, ఇటీవల గ్రామ దేవతల కొలుపు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన యువతితో మళ్లీ అతను చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఇది తెలిసిన ఆ యువతి భర్త చాకచక్యంగా ఆ యువతి తోటే అతన్ని ఏప్రిల్ 30న హైదరాబాద్‌కు పిలిపించి హత్య చేసి అతని శవాన్ని మంథని సమీపంలోని గాడిదల గండిలో వేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకోవడంతో వంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు సమాచారం. హత్య జరిగి సుమారు పది రోజులు కావడంతో అతని మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమయింది.



