చేదెక్కుతున్న చక్కెర

– ఆరేండ్ల గరిష్ట స్థాయికి చేరిక
– వర్షాభావ పరిస్థితులే కారణం
న్యూఢిల్లీ : చక్కెర చేదెక్కుతోంది. దేశంలో చక్కెర ధర మంగళవారం నాడు ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. రుతుపవనాలు బలహీనంగా ఉండడమే దీనికి కారణమని భావిస్తున్నారు. గత పక్షం రోజులలోనే చక్కెర ధరలు మూడు శాతం పెరిగాయి. 2017 అక్టోబర్‌ తర్వాత తొలిసారిగా మెట్రిక్‌ టన్ను పంచదార ధర రూ.37,760కి చేరింది. కాగా వచ్చే నెలలో పండుగల సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా దేశంలో చాలినన్ని నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
చెరకు పంటను అత్యధికంగా సాగు చేసే మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీంతో అక్టోబర్‌ 1న ప్రారంభమయ్యే కొత్త సీజన్‌లో చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తుందని అంటున్నారు. ‘కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గిపోతుందని చక్కెర మిల్లుల యాజమాన్యాలు అందోళన చెందుతున్నాయి. దీంతో తక్కువ ధరకే పంటను విక్రయించేందుకు సిద్ధపడుతున్నాయి’ అని బాంబే చక్కెర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌ జైన్‌ చెప్పారు.

Spread the love