కెప్టెన్సీ వదిలేసిన బట్లర్‌

Butler who left the captaincyనేడు దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్‌ ఢీ
కరాచి (పాకిస్థాన్‌) : ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ వైఫల్యానికి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోశ్‌ బట్లర్‌ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. గ్రూప్‌-బిలో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లాండ్‌.. తర్వాతి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి చెందింది. వరుస ఓటములతో చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించింది. ‘కెప్టెన్‌గా తప్పుకోవటం సరైన నిర్ణయం అనుకుంటున్నాను. కోచ్‌ మెక్‌కలమ్‌తో కలిసి మరొకరు ఇంగ్లాండ్‌ను నడిపించాల్సిన సమయం ఇది. నాయకుడిగా నా శకం ముగిసింది’ అని జోశ్‌ బట్లర్‌ పేర్కొన్నాడు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను చాంపియన్‌గా నిలిపిన జోశ్‌ బట్లర్‌.. వన్డేల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదు. 34 వన్డేల్లో కెప్టెన్సీ వహించగా.. 22 మ్యాచుల్లో ఇంగ్లాండ్‌ పరాజయం పాలైంది. ఇయాన్‌ మోర్గాన్‌ కెప్టెన్సీ వారసత్వాన్ని బట్లర్‌ కొనసాగించటంలో విఫలమయ్యాడు. నిరుడు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ చేతిలో ఓటమితో కోచ్‌ మాథ్యూ మాట్‌ నిష్క్రమించగా.. మెక్‌కలమ్‌ పొట్టి ఫార్మాట్‌ బాధ్యతలు సైతం చేపట్టిన సంగతి తెలిసిందే.
నేడు సఫారీతో ఢ : కెప్టెన్‌గా బట్లర్‌ తప్పుకోవటంతో యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు సారథ్య పగ్గాలు దక్కనున్నాయి. జో రూట్‌ సైతం రేసులో నిలిచినా అతడు సుముఖంగా లేడని తెలుస్తోంది. గ్రూప్‌-బిలో రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్‌ నేడు ఊరట విజయంపై కన్నేసింది. సఫారీలు మాత్రం విజయంపై కన్నేసి బరిలోకి దిగుతున్నారు. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలని దక్షిణాఫ్రికా ఆలోచన. గాయం బారిన పడిన స్టార్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ నేడు కరాచిలో బరిలోకి దిగనుండటం దక్షిణాఫ్రికాకు అదనపు బలం.

Spread the love