సంకీర్ణ రాజ్యంలో సమాఖ్యతత్వం పరిఢవిల్లేనా?

Can federalism prevail in a coalition state?– బీజేపీ పాలనలో అంతా కేంద్రీకృత పాలనే
– అన్నింటా వారిదే పెత్తనం
– జీఎస్టీ అమలుతో కుదేలైన రాష్ట్రాలు
– రుణ పరిమితిపై ఆంక్షలు
– రాష్ట్రాల అభివృద్ధికి అడుగడుగునా మోకాలడ్డు
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. గత పది సంవత్సరాల కాలంలో పరిపాలన యావత్తూ ‘వన్‌ మ్యాన్‌ షో’ తరహాలో సాగింది. అయితే ఇప్పుడు ఆ వాతావరణం లేదు. తెలుగుదేశం, జేడీయూ సహా పలు పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పరిపాలన సాగించాల్సి ఉంటుంది. తెలుగుదేశం, జేడీయూ పార్టీలకు కలిపి 28 మంది సభ్యులు ఉన్నారు. వారు కోరుకుంటే ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని అస్థిరపరచవచ్చు.
2014, 2019 ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో ప్రధాని మోడీ ఆడింది ఆట…పాడింది పాట మాదిరిగా సాగిపోయింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర నిధులపై కట్టుదిట్టమైన నియంత్రణల ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అనేక ఇబ్బందులు పెట్టింది. ఆయా రాష్ట్ల్రాల్లో గవర్నర్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మోకాలడ్డారు. ప్రజా తీర్పును కాలరాస్తూ బీజేపీ యేతర ప్రభుత్వాలను కూలదోయడానికి కూడా బీజేపీ నాయకత్వం వెనకాడలేదు. దీంతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింది. అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమయ్యాయి.
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక పరంగా సమాఖ్యతత్వం రూపుదిద్దుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
అప్పుడు రాష్ట్రాల చేతిలో అధికారాలు
బండి చక్రాల మాదిరిగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు సమాఖ్యతత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది. అదే రాజ్యాంగం నిర్మించిన డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌. 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా మన దేశం రాజ్యాంగపరంగా మూడు ఇంజిన్ల ప్రభుత్వంగా మారిపోయింది. స్థానిక సంస్థలు గతంలో మూడో ఇంజిన్‌గా పనిచేశాయి. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడవి నిర్వీర్యమైపోయాయి. గతంలో రాష్ట్రాలకు స్వతంత్రంగా పన్నులు విధించుకునే అధికారం ఉండేది.
రాష్ట్రాలను స్వతంత్రంగా అభివృద్ధి చేసుకునేందుకు, అందుకోసం నిధులు ఖర్చు చేసేందుకు వాటికి స్వేచ్ఛ ఉండేది. వ్యయంలో ఐదింట మూడో వంతు రాష్ట్రాల పరిధిలోనే జరిగేది. కేంద్రం వద్ద రుణ బకాయిలు ఉన్నప్పుడు మినహాయించి ఇతరత్రా రుణాలు తీసుకునేందుకు కూడా రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఉండేవి.
జీఎస్టీ అమలుతో…
జీఎస్టీ అమలుతో అంతా తారుమారై పోయింది. జీఎస్టీ విధానాన్ని నిర్ణయించడంలో, దానిని అమలు చేయడంలో తమకు సమాన అధికారాలు ఉంటాయన్న నమ్మకంతో తమ అమ్మకపు/విలువ ఆధారిత పన్ను అధికారాలను, కొన్ని ఇతర పన్నులకు సంబంధించిన అధికారాలను జీఎస్టీలో కలిపేసేందుకు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే మోడీ ప్రభుత్వం కేంద్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల ఉమ్మడి అధికారాలను ఉపయోగించి జీఎస్టీ విధానాన్ని, దాని అమలును కేంద్ర ప్రభుత్వ పన్నుగా మార్చేసింది. కోవిడ్‌ సమయంలో తమకు ఇస్తానని హామీ ఇచ్చిన జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలంటూ రాష్ట్రాలు ఎన్ని అభ్యర్థనలు చేసినప్పటికీ అవన్నీ కేంద్రం వద్ద చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా మారిపోయాయి.
గుదిబండగా కేంద్ర పథకాలు
కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్‌ చేసే పథకాలు (సీఎస్‌ఎస్‌) కూడా రాష్ట్రాలకు గుదిబండగా మారాయి. రాష్ట్రాల ఖర్చులు, అభివృద్ధిపై అవి ప్రభావం చూపాయి.
సీఎస్‌ఎస్‌ల పేరు మార్చి అవి కేంద్ర ప్రభుత్వ పథకాలన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. ఈ పథకాలకు నిధుల కేటాయింపులపై కేంద్రానిదే నియంత్రణ. ఆయా పథకాల అమలులో కేంద్రం జోక్యం అధికంగానే ఉంటుంది. సీఎస్‌ఎస్‌లకు రాష్ట్రాలు అందించాల్సిన వాటాను గణనీయంగా పెంచారు. అదే సమయంలో రాష్ట్ర పథకాల పరిమాణాన్ని కుదించారు. మొత్తంగా పథకాల వ్యయ భారం రాష్ట్రాలపైనే అధికంగా పడింది. మరోవైపు కేంద్ర నిధుల విడుదలను నియంత్రించారు. ఆడిట్ల పేరుతో చిన్న చిన్న లోపాలను భూతద్దంలో వెతికిపట్టి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకుండా ఆపేశారు.

అప్పుకు అడ్డుపడి…
ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాలకు అప్పు పుట్టకుండా కేంద్రం అనేక సమస్యలు సృష్టించింది. ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల రుణ పరిమితిని కుదించారు. గతంలో అధికంగా తీసుకున్న అప్పును రికవరీ చేసే పేరుతో తాజా రుణాలకు మోకాలడ్డారు. కోవిడ్‌ సమయంలో అదనపు రుణాలు పొందేందుకు అనుమతించిన ప్పటికీ సవాలక్ష షరతులు విధించారు. కేంద్రం కబంధ హస్తాల నుండి రాష్ట్రాలు తప్పించుకోకుండా మోడీ ప్రభుత్వం వడ్డీ లేకుండా యాభై సంవత్సరాల మూలధన వ్యయ రుణాలను ఇవ్వడం ప్రారంభిం చింది. దీంతో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అప్పుల కోసం ఎగ బడ్డాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రాష్ట్ర ఇంజిన్‌ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఇంజిన్‌కు రాష్ట్రాలు ట్రాక్టర్‌ ట్రాలీ ఇంజిన్‌గా మారిపోయాయి.

కింకర్తవ్యం ?
రాష్ట్రాల అధికారాలను, స్వయం ప్రతిపత్తిని కాపాడాలంటే ఏం చేయాలి?. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే…జీఎస్టీ మండలిలో నిర్ణయాలు తీసుకునే అధికారాలు రాష్ట్రాల చేతిలో కూడా ఉండాలి. కేంద్రానికి ఉన్న ఓటింగ్‌ అధికారాన్ని 15%కి తగ్గించాలి. దీనివల్ల జీఎస్టీ మండలిలో కేంద్రానికి విశేషాధికారాలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఏకాభిప్రాయం సాధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిలువరించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సీఎస్‌ఎస్‌ పథకాలను రద్దు చేసి, ఆ నిధులను రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాష్ట్రాలకు కేంద్ర నిధులు అందుతాయి. రాష్ట్రాలకు రుణాలు ఇచ్చే పద్ధతికి కేంద్రం స్వసి చెప్పాలి. మూలధన వ్యయ రుణ పథకాన్ని కేంద్రం వెంటనే నిలిపివేయాలి.

Spread the love