– అంతుచిక్కని ఓటరు నాడి
– తలపట్టుకుంటున్న లీడర్లు
– అన్ని పార్టీల సభలకూ జనం
– రోజుకో రకంగా మారుతున్న సమీకరణాలు
– సామాజిక తరగతుల వారిగా కేంద్రీకరణ
– ఓట్ల బదిలీపై ఎవరి లెక్కలు వారివే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిల బడ్డ ప్రధాన పార్టీల అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. సన్నిహితుల దగ్గర తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఫలానా సామాజిక తరగతి పెద్దలు ఏమను కుంటు న్నారో.. తెలుసుకోవాలని వేగులను పంపుతున్నారు. కానీ ఓటర్లు ఎవరిని కనిక రించబోతున్నారన్న విష యం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా ఏ మాత్రం అంతు చిక్కటం లేదు. అన్ని పార్టీల సభ లకూ జనం వస్తుండటంతో అభ్యర్థులు గందర గోళ ం పడుతు న్నారు. లీడర్లు తలప ట్టుకుటున్నా రు.గడిచి న పదేండ్లుగా అధికా రంలో ఉన్న బీఆర ్‌ఎస్ పార్టీపై పైకి వ్యతిరేకత బాగా నే కన్పిస్తు న్నా అది విపక్షాలకు ఓట్లుగా బదిలీ అవుతుందా..? లేదా అన్నది ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు అనే అంచనాలు ఉన్నప్ప టికీ.. ఆయా నియోజక వర్గాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ వల్ల ప్రధాన పార్టీలు ఆందోళన చెందు తున్నాయి. వీరి పోటీవల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనే చర్చతో పాటు, గ్రామాల్లో ఏ సామాజిక తరగతి ఓట్లు ఎవరికి వేస్తారో లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో ఒక్కోచోట ఒక్కోరకమైన సమీకరణలు చోటు చేసుకుంటుండటంతో ఫలాన పార్టీది పైచేయిదిగా ఉండవచ్చని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ దఫా ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు పోటీగా సీపీఐ(ఎం)కు అనూహ్యంగా మద్దతు చేకూరుతున్నట్టు తెలుస్తున్నది.
సామాజిక సమీకరణలపైనే అందరి దృష్టి..
సామాజిక సమీకరణల మీదనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆయా నేతలు వాగ్దానాలు చేస్తున్నారు. వారి ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ కులం ఓట్లు ఎక్కువగా పడుతున్నాయో గమనించి, ఆ తరగతిలో చీలిక తీసుకురావటం ఎలాగనే దానిపై బీఆర్‌ఎస్ ఎత్తులు వేస్తోందని చర్చించుకుంటున్నారు. ఏబీసీడీ వర్గీకరణ, ముస్లిం రిజర్వేషన్లు తదితర అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. బీసీ ముఖ్యమంత్రి వాగ్దానంతో ఆయా తరగతుల్లో చీలిక తీసుకొచ్చేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నదని తెలుస్తున్నది. మరోపక్క అధికార పార్టీకి ఉపయోగపడేలాగా ఎంఐఎం పావులు కదుపుతున్నది.
పోరాటాలే.. ప్రచారాస్త్రాలు..
మరోవైపు రాష్ట్రంలో సీపీఐ(ఎం) 19 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఆయా నియోజక వర్గాల్లో హౌరాహౌరీగా ప్రచారం సాగుతుండటంతో ఈ మూడు పార్టీల మధ్య సమీకరణలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రజల దైనందిన సమస్యలపై నిరంతరం ఆ పార్టీ, ప్రజాసంఘాలు సాగించిన ఉద్యమాలు, పోరాటాలే సీపీఐ(ఎం) అభ్యర్థులు, నేతలు ప్రచారాస్త్రాలుగా ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు ఏ ఒక్కరూ గెలవటానికి వీలు లేకుండా తగిన విధంగా రాజకీయ ఎత్తుగడలతో పావులు కదుపుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద చర్యలు, తద్వారా ప్రజల మధ్య అనైక్యత, దేశ సమగ్రతకు వాటిల్లబోయే ప్రమాదాన్ని ఈ సాధారణ ఎన్నికలకు రాజకీయ ప్రచార వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.
రాష్ట్రంలో మైనార్టీ, దళిత, గిరిజన ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంటుందన్నది అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఈ సామాజికవర్గ ఓటర్లు గడిచిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వైపు నిలుస్తూ వచ్చారు. కానీ ఈ దఫా చీలకవచ్చే పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. అయితే మొత్తం సమీకరణలను పరిగణలోకి తీసుకున్నప్పుడు బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశాలున్నచోట మాత్రం మైనార్టీ ఓటర్లు ఏకీకృతం అయి అక్కడ ఆ పార్టీని ఓడించగలిగే శక్తి వైపు మొగ్గే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.
ఈ నాలుగు రోజులు కీలకం..
ఎన్నికల పర్వంలో రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలక సమయం అని చెప్పక తప్పదు. ఇప్పటికే ప్రచారంలో నువ్వా.. నేనా అన్నట్టు తలపడుతున్న రాజకీయపార్టీలు రాబోయే ఆరు రోజుల్లో సామాజిక సమీకరణలు సమూలంగా మార్చివేసే అవకాశాలు మెండుగా ఉంటాయని తెలుస్తున్నది. చివరి దశలో సానుకూల ప్రతికూల ఓటింగ్ సమీకరణలు పూర్తిగా మారిపోయే పరిస్థితులు ఉండవచ్చని భావిస్తున్నారు. అధికారపార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యానిఫెస్టో వార్ తారాస్థాయికి చేరిన దరిమిలా ఓటర్లను ఏ పార్టీ ఆకట్టుకోగలిగితే ఆ పార్టీ వైపు సమీకరణలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చివరి రెండ్రోజుల్లో అభ్యర్థులు ఇచ్చే తాయిలాలు ఓటర్లను ప్రభావితం చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఆరు రోజులు అన్ని పార్టీలకు అత్యంత కీలకం అని చెప్పాలి.