చెక్‌ పెట్టలేమా?

ఆటల్లో వాడే మాటలు రోజువారీ వినియోగంలోకొచ్చి రాజకీయ పరిభాషలోకి జొరబడ్డాయి. చెక్‌ పెట్టడం, సెల్ఫ్‌ గోలేసుకోవడం, ఔట్‌ చేయడం వంటివి ఆ బాపతువే! మిగతా రాష్ట్రాల సంగతెలా ఉన్నా, మన తెలంగాణలో గతేడాది చివరి మూడు నాలుగు నెలలు ‘మూడు ముక్కలాట’ సాగింది. బీజేపీ వారు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకటేనన్నారు. బీఆర్‌ఎస్‌ వారు కాంగ్రెస్‌, బీజేపీ ఒకటేనన్నారు. కాంగ్రెసేమో బీఆర్‌ఎస్‌ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలైపోయాయి. సరైన అభ్యర్థులే దొరకని బీజేపీ అధికారంలోకొస్తామనుకోక పోయినా, అటు ‘గోడీ మీడియా’, ఇటు వారి వాట్సాప్‌ యూనివర్సిటీ చేసిన నానా యాగీ చూసి రాష్ట్రం విస్తుపోయింది. వెంటనే పార్లమెంటు ఎన్నికలు ముంచుకు వస్తున్నా, రాష్ట్ర పాలకులు మారినా బాణీ లు మారలేదు. కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కుమ్ముక్కయినాయని మొన్న ఆదిలాబాద్‌ సభలో మోడీ బలంగా ఉపన్యాసం దంచితే, ‘ఛోటే భారుకా బడే భారు’ అని మొన్న డిసెంబర్‌ 7 వరకు ‘ఆకాశవాణి’గానే గాక అధికార బాణిగా విరాజిల్లిన పత్రిక నుడివింది. ఎవరిష్టం వారిదని సరిపెట్టుకోవల్సిన విషయాలు కావివి.
ప్రజల జీవనోపాధికి సంబంధించిన అసలు సమ స్యలు- ఉపాధిలేమి, తరిగిపోతున్న వేతనాలు, జీవన ప్రమాణాలు, కుప్పపడున్న సంపద పిడికెడు మంది కి, మగ్గుతున్న పేదరికంలో కోట్లాదిమంది, మానవా భివృద్ధి సూచీలో అద:పాతాళంలో భారతదేశం, వెరసి అమలుకు నోచుకోని ప్రభుత్వాల వాగ్దానాలను పై మూడు పార్టీలు చర్చనీయాంశం కాని వ్వలేదు. సహజంగా జనం వాటి గురించి ఆలోచించకుండా చేయ గలిగారు. పార్లమెంటు ఎన్నికల య్యేలోపు ప్రధాని తెలంగాణలో ఎన్ని సుడిగాలి పర్యటనలు చేస్తా రో తెలీదు. ఎన్నెన్ని వాగ్దా నాలు కుమ్మరిస్తారో కూడా తెలీదు. మోడీ లక్ష్యాలు వేరు. ప్రజల అవసరాలు వేరు.
ఆదిలాబాద్‌ జనం యాభైయ్యేండ్లుగా మొత్తుకుంటున్న అంశం బుల్లెట్‌ ట్రెయిన్‌ కాదు. ఆదిలాబాద్‌ పట్టాల్ని ఆర్మూర్‌ దాకా 140 కి.మీ. వేసి రాష్ట్ర రాజ ధానితో అనుసంధానం చేయమని. మోడీ అంటేనే గ్యారంటీ అంటూ రోటినిండా ఊకేసి దంచిన ఆ పెద్దమనిషి ‘ఆ ఒక్కటీ అడగద్ద’న్నారు. మూతబడ్డ సిసిఐ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)ను తిరిగి తెరిపించాలనేది ఆ జిల్లా వాసుల కీలక డిమాండు. పైగా తమని గెలిపిస్తే సిసిఐని తెరిపిస్తామనేది గతంలో బీజేపీ నేతల వాగ్దానం. గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు సదరు ఎంపీ గారు. ఈ రెండు అంశాల పేరునా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు శాసనసభ కెన్నికైనారు. ఆ డిమాండ్ల పట్ల ఆ జిల్లా వాసుల్లో ఉన్న దాహార్తికి నిదర్శనమిది. ఇనుప ఖనిజం దొరికే జిల్లాలో మినీ స్టీల్‌ ప్లాంట్‌ కావాలని అడిగినా, నంబర్‌ వన్‌ పత్తి పండే జిల్లాలో టెక్స్‌టైల్స్‌ పార్కు డిమాండు చేసినా అది ఆ జిల్లా సమగ్రాభివృద్ధి కోస మేగా!? అక్షర క్రమంలోనే గాక ఉత్తరా నున్న మొదటి జిల్లా సమ స్యలు పరిష్కరించడం మరిచిన మోడీ సర్కార్‌కు ‘ఫిర్‌ ఏక్‌ బార్‌’ అని అడిగే నైతికత ఎక్కడుంది?
ఇక పటాన్‌చెరు కార్మిక కేంద్రంలో దూరంగా ఉండే కొండల్ని చూపి అవి ఎంత నున్నగా ఉన్నాయో అనుభవించి, పలవరించమన్నారు మోడీ. ఆ కార్మిక వాడల్లో నికృష్టపు వేతనాలతో, రోగాలు రొష్టులూ వస్తే ఆదుకునే దిక్కులేక రాలిపోతున్న వారి గురించి బీజేపీ నేతలకు తెలుసా? 12 – 14 గంటలు పని దినంతో, జాతీయ సెలవు దినాల్తో సహా ఏ సెలవూ లేకుండా గానుగెద్దుల్లా ఆ కార్మికులు 365 రోజులు పని చేస్తున్నారని, ఎందరో వలస కార్మికులు భద్రతా పరికరాలు కూడా లేకుండా ప్రమాదాల్లో కాలి మసై పోతున్నారని మోడీకి తెలుసా? కార్మికవాడల్లో భారత రాజ్యాంగం పెట్టుబడి దారుల చేతిలో ‘టిష్యూ’ పేపరైపోయిం దని, వందేండ్లకు పైగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు యంత్రాల యజమానుల ముందు చేతులు కట్టుకుని ‘చెప్పు దొరా!’ అంటూ అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలోని భూతంలా నిలబడుతున్నాయి. ఈ విషయాలేవీ నిన్న పటాన్‌చెరు సభలో వేదికమీదున్న బీజేపీ నేతలెవరికీ పట్టవు. మెదక్‌ పార్లమెంటు సీటులో కార్మిక వాడలు కీలకమౌతాయి కాబట్టి ఆ వాడల్లోని కార్మికులను మతం ఆధారంగా పోలరైజ్‌ చేసే ఉద్దేశంతోనే ప టాన్‌చెరు సభ జరిగినట్టుంది. ఎందుకంటే ఒకసారి కార్మికుల్ని వొంచ గలిగితే మిగిలిన సమాజాన్ని వంచడం తేలికనే విషయం కాషాయ నేతలకెరుకే. ఏదైనా తెలంగాణ సమాజం అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూచిన తర్వాత ఎన్నో రెట్లు జాగ్రత్త వహించక పోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

Spread the love