క్యాపిటల్స్‌ రనౌట్‌!

Capitals run out!– ఛేదనలో కరుణ్‌ పోరాటం వృథా
– 12 పరుగులతో ముంబయి విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌ రనౌట్‌. సీజన్లో వరుసగా ఐదో విజయం లాంఛనం చేసుకున్న క్యాపిటల్స్‌.. బుమ్రా ఓవర్లో వరుసగా మూడు రనౌట్లతో ఐపీఎల్‌18లో తొలి పరాజయం చవిచూసింది. 206 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 193 పరుగులకే కుప్పకూలింది. కరుణ్‌ నాయర్‌ (89) పోరాటం వృథా కాగా.. ముంబయి ఇండియన్స్‌ సీజన్లో రెండో విజయం సాధించింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
12 బంతుల్లో 23 పరుగులు. ముంబయిపై విజయానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ సమీకరణ ఇది. క్రీజులో సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆషుతోశ్‌ శర్మ. బుమ్రాపై వరుస బౌండరీలు బాదిన ఆషుతోశ్‌ (17) జోరు మీదున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయానికి మరో 15 పరుగుల దూరంలో నిలువగా.. హ్యాట్రిక్‌ రనౌట్లు ఆ జట్టును దెబ్బతీశాయి. ఆషుతోశ్‌, కుల్దీప్‌ యాదవ్‌ (1), మోహిత్‌ శర్మ (0) వరుస బంతుల్లో రనౌట్‌గా నిష్క్రమించారు. దీంతో 18.5 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 193 పరుగులకే కుప్పకూలింది. కరుణ్‌ నాయర్‌ (89, 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీకి తోడు అభిషేక్‌ పోరెల్‌ (33, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరవటంతో 119/1తో ఢిల్లీ క్యాపిటల్స్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ మిడిల్‌ ఆర్డర్‌లో కెఎల్‌ రాహుల్‌ (15), అక్షర్‌ పటేల్‌ (9), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1), విప్‌రాజ్‌ నిగమ్‌ (14) నిరాశపరిచారు. చేజారిందనుకున్న మ్యాచ్‌లో మెరుపు విజయం సాధించిన ముంబయి ఇండియన్స్‌ వరుస పరాజయాల నుంచి బయటపడింది. అంతకుముందు తిలక్‌ వర్మ (59) అర్థ సెంచరీతో ముంబయి ఇండియన్స్‌ తొలుత 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.
తిలక్‌ వర్మ జోరు :
తెలుగు తేజం తిలక్‌ వర్మ (59, 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీతో చెలరేగాడు. అరడజను ఫోర్లు, మూడు సిక్సర్లతో కదం తొక్కిన తిలక్‌ వర్మ తొలి నుంచే ఎదురుదాడి చేశాడు. టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌లో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన తిలక్‌ వర్మ ముంబయి ఇండియన్స్‌కు 205 పరుగుల భారీ స్కోరు అందించాడు. పవర్‌ప్లేలో 59/1తో నిలిచిన ముంబయిని తిలక్‌ వర్మ నిలబెట్టాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 26 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (18), రియాన్‌ రికెల్టన్‌ (41) శుభారంభం అందించారు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో రోహిత్‌ నిష్క్రమించినా.. రికెల్టన్‌ జోరు కొనసాగించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (40) మరోసారి మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (2) నిరాశపరిచాడు. ఆఖర్లో నమన్‌ దిర్‌ (38 నాటౌట్‌, 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు పిండుకున్నాడు. ఆఖరు ఓవర్లో అవుటైన తిలక్‌ వర్మ.. ముంబయి ఇండియన్స్‌కు భారీ స్కోరు సాధించిపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (2/23) మాయ చేశాడు. విప్‌రాజ్‌ నిగమ్‌ (2/41), ముకేశ్‌ కుమార్‌ (1/38) సైతం రాణించారు.

Spread the love