అమాంతంగా కుదిపేసిన రెండు భారీ భూకంపాలు
164 మంది మృతి…శిధిలాల కిందే అరణ్యరోదన
10 వేల నుంచి లక్ష వరకు మృతులుండొచ్చని అంచనా
పేకమేడల్లా కూలిన భవనాలు…ఎమర్జెన్సీ విధింపు
ప్రపంచ దేశాల ఆపన్న హస్తం
కార్కస్ : వెనిజులా ఉత్తర తీరంలో బుధవారం నిమిషం వ్యవధిలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. గత శతాబ్ద కాలంలో వెనిజులాను అతలా కుతలం చేసిన భారీ భూకంపం ఇదే. భూకంపాల కారణంగా కనీసం 164 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ శిధిలాల కింద భారీ సంఖ్యలో చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించే పనిలో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందలేదు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్తులో వెనిజులాకు సాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బందులు పడుతున్న వెనిజులాను భూకంపాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. తొలుత బుధవారం సాయంత్రం యారకురు రాష్ట్రంలోని శాన్ ఫెలిప్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత 40 సెకన్లకే అదే రాష్ట్రంలోని యుమేర్ పట్టణానికి ఆగేయంగా 23 కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.
ఈ రాష్ట్రంలోనే దేశంలోని అతి పెద్ద చమురు రిఫైనరీలు ఉన్నాయి. వెనిజులాలో బుధవారం సెలవు దినం కావడంతో చాలా మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దేశంలో ని కొన్ని ప్రాంతాలలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. సమీపంలోని కొలంబియాలో సైతం భూమి కంపించింది. ఇది భూకంప కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఆవాసాలను, పెంపుడు జంతువులను వదిలి వీధులలోకి వచ్చారు. భూకంప దృశ్యాలు ‘హారర్ చిత్రాన్ని’ తలపిం చాయని ఓ బాధితుడు వ్యాఖ్యానించాడు. అయితే సునామీ ముప్పేమీ లేదని అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో భవ నాలు పేకమేడల మాదిరిగా కూలిపోయాయి. కోస్తా ప్రాంతంలోని లా గుయారా రాష్ట్రం బాగా దెబ్బ తిన్నది. దీనిని విపత్తు జోన్‌గా ప్రకటించా మని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతా లలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టా మని ఆమె చెప్పారు. రాజధాని కార్కస్ సహా దేశంలోని పలు ప్రాంతాలలో భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని వీడియో దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మకుటో నగరంలోని ఓ హోటల్ పూర్తిగా కూలిపోయి శిధిలాలు మాత్రమే కన్పిస్తున్నాయి. కటియా లా మర్ పట్టణంలో భవనాలు, ఆకాశ హర్మ్యాలు మరమ్మతులకు కూడా పనికి రాకుండా పోయాయి.
కార్కస్ సమీపంలోని సిమన్ బొలివర్ విమానాశ్రయం దెబ్బతినడంతో దానిని తాత్కాలికంగా మూసివేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తరగతులను వారం పాటు నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు, అత్యవసరం కాని పనులను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. 10 వేల నుంచి లక్ష వరకు మృతులుండొచ్చన్న అంచనా భూకంపాల తీవ్రతను ద ష్టిలో ఉంచుకుని ఎస్‌జీఎస్ ఆందోళనకర అంచనాలు విడుదల చేసింది. ఈ విపత్తులో మ తుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. భారీ ప్రాణనష్టం, విస్త త స్థాయిలో విధ్వంసం జరిగి ఉండవచ్చని హెచ్చరించింది. అయితే, ఈ సంఖ్యలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, అధికారిక గణాంకాలు ఇంకా వెలువడాల్సి ఉందని అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
వెనిజులాకు మానవతా సాయం
దేశవ్యాప్తంగా భద్రతా దళాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని భవనాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. వివిధ దేశాలు సహాయ బృందాలను పంపుతున్నాయని రోడ్రిగ్జ్ చెప్పారు. అమెరికా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, మెక్సికో, ఖతార్ దేశాల నుంచి సహాయ బృందాలు వెనిజులాకు చేరుకుంటున్నాయి. చైనా, బ్రెజిల్, కరేబియన్ దేశాలు మానవతా సాయాన్ని పంపుతున్నాయి.
జపాన్‌ను కుదిపేసిన 7 తీవ్రత భూకంపం
జపాన్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై
7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్‌లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. కొన్ని సెకన్ల పాటు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జాతీయ భూకంప పరిశోధనా సంస్థల సమాచారం ప్రకారం భూకంప కేంద్రం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో, భూమికి సుమారు 64 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప ప్రకంపనలు జపాన్ ఉత్తర ప్రాంతాలతో పాటు రాజధాని టోక్యోలోనూ స్వల్పంగా ప్రభావితమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.



