కేజ్రీవాల్‌ నివాసంపై సీబీఐ విచారణ మొదలు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసం నిర్మాణం, పునరుద్ధరణలో జరిగిన అవకతవకలపై సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు.ఆరోపణలను ధృవీకరించడానికి దర్యాప్తు ఏజెన్సీ ప్రాథమిక విచారణను నిర్వహిస్తుంది. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని అధికారులు తీసుకుంటారు. ఈ అక్రమాలను మొదట లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) కార్యాలయం లేవనెత్తింది. వారు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) చేత ఆడిట్‌ చేయాలని కోరుతూ ఈ ఏడాది మేలో కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)కి లేఖ రాశారు. మార్పు పేరుతో సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణంలోఅవకతవకలు జరిగాయని ఎల్జీ కార్యాలయం పేర్కొన్నది. సీబీఐ ప్రాథమిక విచారణపై అధికార ఆప్‌ స్పందించింది. ఆప్‌ ఎలాంటి తప్పూ చేయలేదని ఖండించింది. బిజెపిపై ఆరోపణలు సంధించింది. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని పార్టీని ప్రజల కోసం పని చేయకుండా ఆపడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్య అని అభివర్ణించింది. కేజ్రీవాల్‌ 2015లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సివిల్‌ లైన్స్‌లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌లోని అధికారిక నివాసాన్ని ఆక్రమిస్తున్నారు.

Spread the love