ఐఎన్‌ఎల్‌డీ చీఫ్‌ హత్యపై సీబీఐ దర్యాప్తు

– అసెంబ్లీకి హర్యానా హోం మంత్రి హామీ
చండీఘడ్‌ : ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నాఫె సింగ్‌ రథీ హత్యపై సీబీఐ దర్యాప్తు జరుపుతుందని హర్యానా హోం మంత్రి అనీల్‌ విజ్‌ అసెంబ్లీకి తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల యంత్రాంగం కుప్పకూలిందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. సీబీఐ దర్యాప్తుతోనే సభ సంతృప్తి చెందుతుందంటే వెంటనే కేసును సీబీఐకి అప్పగిస్తామని సభ్యులకు హామీ ఇస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై కాంగ్రెస్‌ ప్రతిపాదించిన వాయిదా తీర్మానంపై ఆయన మాట్లాడారు. రథీ హత్యపై హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే కాంగ్రెస్‌ సభుయలు ఈ విషయాన్ని లేవదీశారు. ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షం కురిపించడంతో రథీతో పాటూ మరో కార్యకర్త చనిపోయాడు. ఈ హత్యకు సంబంధించి బిజెపి మాజీ ఎంఎల్‌ఎ నరేష్‌ కౌశిక్‌తో సహా 12మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సక్రమంగా పోలీసు దర్యాప్తు సాగుతుందని మంత్రి విజ్‌ చెప్పారు. అయితే ఈ కేసులో అనేక కోణాలు ఇమిడివున్నందున సీబీఐ దర్యాప్తు కావాలని ప్రతిపక్ష నేత భూపిందర్‌ సింగ్‌ హుడా డిమాండ్‌ చేశారు. దానిపై హోం మంత్రి అంగీకరించారు.

Spread the love