నవ కేరళ నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు

నవ కేరళ నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు– రుణ పరిమితిని తగ్గించింది
– పన్నుల్లో వాటానూ కుదించింది : కేరళ సీఎం పినరయి ఆరోపణ
తిరువనంతపురం : నవ కేరళ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అందుకు కేంద్ర విధానాలు అవరోధంగా ఉన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. పన్ను ఆదాయం, ఉత్పత్తి విషయాలలో రాష్ట్రం మంచి ఫలితాలు సాధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఈ సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వ చేతులు కట్టేసిందని చెప్పారు. తప్పుడు విధానాలను వ్యతిరేకించి ప్రజల పక్షాల నిలవాల్సిన ప్రతిపక్షం రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పినరయి విలేకరులతో మాట్లాడుతూ పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేరళ తన రాబడిలో 3% వరకూ బేషరతుగా రుణం పొందవచ్చునని, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసిన పక్షంలో మరో 0.5% పొందవచ్చునని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి కేరళ రుణ పరిమితిని తగ్గించిందని, స్వతంత్ర సంస్థలు తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర రుణ పరిమితితో కలిపేసిందని ఆరోపించారు. ఫలితంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేరళ మొత్తం రుణ పరిమితి రూ.6,000 కోట్లు తగ్గిపోయిందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280 ప్రకారం ఏర్పడిన ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చిందని విమర్శించారు. ‘నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి బోర్డు (కేఐఐఎఫ్‌బీ) వంటి సంస్థలు తీసుకున్న రుణాన్ని రాష్ట్ర రుణంలో కలపాలని పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పలేదు. 2017 ఆగస్టుకు ముందున్న పద్ధతిలోనే రాజ్యాంగంలోని 293 (3), 293 (4) అధికరణల ప్రకారం పబ్లిక్‌ అకౌంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల రుణాలను రాష్ట్ర ప్రభుత్వ రుణ పరిమితి నిర్ధారణ నుండి మినహాయించాలి. అయితే కేంద్ర ఆర్థిక శాఖ ఓ కార్యనిర్వాహక ఆదేశం ద్వారా తప్పుడు వైఖరిని అవలంబించింది. నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సంస్థలు సొంతంగా తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ రుణంలో భాగంగా మార్చేసింది’ అని పినరయి వివరించారు. తద్వారా రాష్ట్ర రుణ పరిమితిని కేంద్రం కుదించిందని ఆరోపించారు. జాతీయ రహదారి-66 అభివృద్ధి కోసం భూసేకరణ నిమిత్తం కేంద్రం 25% సొమ్ము కోరిందని, ఇందుకోసం కేఐఐఎఫ్‌బీ ద్వారా 5,854 కోట్లు సమీకరించామని, అయితే ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ రుణ హక్కుల నుండి కేంద్రం మినహాయించిందని పినరయి చెప్పారు. పన్ను వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన వాటాను కేంద్రం తగ్గించిందని అంటూ 14వ ఆర్థిక సంఘం కాలంలో 42%గా ఉన్న ఈ వాటా 15వ ఆర్థిక సంఘం కాలంలో 41%కి తగ్గిపోయిందని తెలిపారు. దీనికి తోడు కేంద్ర ఆదాయంలో మూడో వంతును సెస్సు, సర్‌ఛార్జికి బదిలీ చేశారని, అయితే వీటిని రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పన్ను పంపిణీకి 2011 జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నదని, ఫలితంగా రాష్ట్ర పన్ను ఆదాయం తగ్గిందని పినరయి చెప్పారు.

Spread the love