– యూసీసీపై కేరళ అసెంబ్లీ తీర్మానం
– ఉపసంహరించుకోవాలని కేంద్రానికి వినతి
తిరువనంతపురం : దేశంపై ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న తొందరపాటు చర్యలను కేరళ శాసనసభ నిరసించింది. ఇటువంటి చర్యలు రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధమని అభిప్రాయపడింది. ఈ మేరకు శాసనసభలో మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. యూసీసీ యోచనను విరమించుకోవాలని ఆ తీర్మానంలో కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి సమర్ధించింది. యూసీసీ అమలుకు నిరసనగా సీపీఐ (ఎం), కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సెమినార్లు నిర్వహించాయి. ‘యూసీసీ అమలుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై కేరళ శాసనసభ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిని రాజ్యాంగ లౌకిక స్వభావాన్ని దెబ్బ తీసేందుకు కేంద్రం చేపట్టిన తొందరపాటు, ఏకపక్ష చర్యగా భావిస్తోంది. దేశ ప్రజలపై ప్రభావం చూపే ఇలాంటి ఏ చర్యనైనా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి’ అని తీర్మానంలో విజయన్ ప్రాతిపాదించారు. యూసీసీని రాజ్యాంగం కేవలం ఆదేశిక సూత్రంగానే పరిగణించిందని తీర్మానం గుర్తు చేసింది. రాజ్యాంగంలోని 44వ అధికరణలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలను విధిగా అమలు చేయాలని న్యాయ వ్యవస్థ సైతం ఆదేశించలేదని స్పష్టం చేసింది. పలు దఫాల సంప్రదింపుల తర్వాతే యూసీసీని రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలలో చేర్చారని తెలిపింది. ‘రాజ్యాంగ ఉపోద్ఘాతంలో లౌకికతత్వానికి హామీ ఇచ్చారు. ఏ మతం పైన అయినా నమ్మకం ఉంచేందుకు, దానికి అనుగుణంగా జీవించేందుకు రాజ్యాంగం పౌరులకు స్వేచ్ఛ కల్పించింది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛలో మతపరమైన వ్యక్తిగత చట్టాలను అనుసరించేందుకు, ఆచరించేందుకు ఉన్న హక్కు కూడా చేరి ఉంది. దానిని అడ్డుకునేందుకు చేసే ఏ చట్టమైనా రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును నిరాకరించడం, ఉల్లంఘించడమే అవుతుంది. యూసీసీని రాష్ట్రాలు మాత్రమే ప్రతిపాదించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 చెబుతోంది. అది కూడా వివిధ మతాల వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతేనని స్పష్టం చేసింది’ అని కేరళ శాసనసభ ఆమోదించిన తీర్మానంలో వివరించారు.