మందు పోయను… పైసలు పంచను

I don't give medicine... I don't give money– ప్రజల దయ ఉంటే ఎమ్మెల్యేగా గెలుస్తా…
– లేకపోతే ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటా : రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ కీలకవ్యాఖ్యలు
– వేములవాడలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
– బీసీబంధు, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల పట్టాలు పంపిణీ
నవతెలంగాణ – కరీంనగర్‌
ప్రాంతీయ ప్రతినిధి
‘ఓట్ల కోసం మందు పోయించి, పైసలు పంచే వారిని నమ్మొద్దు. ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయలేదు. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లోనూ మందుగానీ, పైసలుగానీ పంచబోను. మీ దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా. లేదంటే ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటా’ అంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తన నియోజకవర్గమైన రాజన్నసిరిసిల్లలో కీలకవ్యాఖ్యలు చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముందుగా వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. చింతల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్‌లో బీసీ బంధు చెక్కులను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా 12లక్షల మందికి కల్యాణలక్ష్మి కింద నిధులిచ్చాం. రైతు బీమానే కాదు.. నేతన్న బీమా కూడా మొదలుపెట్టాం. సెప్టెంబర్‌లో సిరిసిల్లలో మెడికల్‌ కాలేజీని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఓట్ల కోసం విపక్ష నేతలు వచ్చినప్పుడు 60ఏండ్లుగా చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని నిలదీయండి’ అంటూ ప్రజలను కోరారు. బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి మొదలుకుంటే.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఏకైన సర్కారు కూడా తమదేనన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకుంటారని, ఆ నమ్మకం తనకు పూర్తిస్థాయిలో ఉందని అన్నారు. 60ఏండ్లలో కనిపించని అభివృద్ధిని 10ఏండ్లలోనే రెండింతలు చేసిన తమ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. బతుకమ్మ పండుగలలోపు వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

Spread the love