నిక్కర్‌ పార్టీ, లిక్కర్‌ పార్టీ రెండూ ఒక్కటే..

Knicker Party and Liquor Party are one and the same.– ఇది నాకు గద్దర్‌ చెప్పిన మాట
– బీఆర్‌ఎస్‌కు 25 సీట్లకు మించి రావు
– అందుకే కాంగ్రెస్‌పై కేసీఆర్‌ దాడి
– చిల్లర రాజకీయాలకు అసెంబ్లీని వేదికగా మార్చారు
– నన్ను దూషించేందుకే కాంగ్రెస్‌ను దోషిగా మారుస్తున్నారు
– తెలంగాణకు చేసిన ద్రోహంపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నిక్కర్‌ పార్టీ, లిక్కర్‌ పార్టీ రెండూ ఒక్కటయ్యాయని గద్దరన్న తనతో చెప్పారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని ఆయన సూచించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ క్రిమినల్‌ పొలిటీషియన్‌ అనీ, జాగ్రత్తగా ఉండాలంటూ గద్దర్‌ అప్పుడే చెప్పారని వివరించారు. లక్ష్యాన్ని చేరేవరకు కార్యదీక్షతో పని చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 25 సీట్లకు మించి రావని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తున్నారని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో రేవంత్‌ విలేకర్లతో మాట్లాడారు. సీఎం, మంత్రులు అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు. శాసనసభలో గద్దర్‌కు సంతాపం తెలపకపోవడం దారుణమన్నారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంలో సర్కారు విఫలమైందని తెలిపారు. ‘కాంగ్రెస్‌ను కేసీఆర్‌, కేటీఆర్‌ చాలా అభ్యంతరకరంగా దూషించారు. తండ్రీ, కొడుకులు చర్చను నా చుట్టూనే తిప్పారు. నన్ను దూషించేందుకు, కాంగ్రెస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ చేసిన ద్రోహంపై చర్చకు సిద్ధమా?
రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ చేసిన ద్రోహంపై చర్చకు సిద్ధమా? అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. సిద్ధమైతే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని డిమాండ్‌ చేశారు. సీఎం రాలేకపోతే మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావును పంపాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నేతలు మంత్రులుగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచిందని గుర్తు చేశారు. ‘కేసీఆర్‌ నువ్వు నా పేరు ఎత్తలేవు. నీ కొడుకు కేటీఆర్‌ నా కండ్లలోకి సూటిగా చూడలేడు. అందుకే చర్చకు అల్లుడు హరీశ్‌రావును పంపండి’ అని సూచించారు. తెలంగాణ పట్ల తన నిబద్ధత ఎప్పుడూ మారలేదని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడంలో తను ముందున్నానని చెప్పారు. కానీ కేసీఆర్‌ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించారని విమర్శించారు. 1996లో 610జీవోను, జోనల్‌ విధానం రద్దు చేయాలంటూ అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో మంత్రిగా కేసీఆర్‌ మాట్లాడిన మాటలను కేటీఆర్‌ వినాలని సూచించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాకారమైందంటూ 13 జూన్‌ 2014లో శాసనసభలో చెప్పిన కేసీఆర్‌…ఇప్పుడు కాంగ్రెస్‌ను, తనను దోషిగా ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. 24 జనవరి 2014లో సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 54 నిమిషాలు సభలో వివరించానన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని నొక్కి చెప్పానని గుర్తు చేశారు. అప్పర్‌ సీలేరు, లోయర్‌ సీలేరులో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని వాపోయారు. తాను ఏ స్థాయిలో ఉన్నా తెలంగాణ పక్షానే ఉన్నానని వివరించారు. పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, ఎస్‌. జైపాల్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి కాంగ్రెస్‌ నాయకులు అధిష్టానాన్ని వ్యతిరేకించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లేనని గుర్తు చేశారు. కేకే మహేందర్‌రెడ్డికి వెన్నుపోటు పొడిచి కేటీఆర్‌ను గెలిపించుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించింది నేను కాదా? అని ప్రశ్నించారు. అప్పుడు అక్కడ టీఆర్‌ఎస్‌ జెండా మోసేవాడే లేడన్నారు. 2011లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని ఇప్పుడు కిషన్‌రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన కేసీఆర్‌ దుర్మార్గుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలూచీలో కేసీఆర్‌ను మించినవారు ఈ దేశంలో ఇక పుట్టరబోరని వ్యాఖ్యానించారు. ఏ రోకటి కాడ ఆపాట పాడే వ్యక్తి ఆయన అని విమర్శించారు.

Spread the love