తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర వైల్డ్‌లైఫ్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌..!

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం లైన్ క్లియర్‌ అయ్యింది. అలాగే రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేషనల్ వైల్డ్‌లైఫ్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించి పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న 23 అభివృద్ధి పనులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు చర్చించి, అనుమతి ఇచ్చింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుపై నిర్మించ తలపెట్టిన లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ (ఖానాపూర్ పరిధి) పథకానికి పర్మిషన్‌ ఇచ్చింది. సాగునీటి శాఖ ప్రతిపాదనలను అటవీశాఖ నిబంధనల మేరకు వైల్డ్‌లైఫ్‌ బోర్డు ద్వారా అనుమతులు సంపాదించింది. 3.17 హెక్టార్ల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమావేశానికి హాజరైన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ, వెడల్పుకు సంబంధించిన 11 ప్రతిపాదనలకు, ఐదు పంచాయతీ రాజ్ రోడ్లకు, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో విద్యుత్ లైన్ ప్రతిపాదనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది.

Spread the love