మైనారిటీ సర్కారును
నిలుపుకోవడమే తొలి సవాల్
మంత్రివర్గ కూర్పు సైతం పరీక్షే
ప్రతిపక్షంలోని డీఎంకే,
అన్నా డీఎంకేలతో గండం
కేంద్రంతో సంబంధాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారో?
అందరి చూపు దళపతి వైపే
తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, హీరో విజయ్ తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించారు. సీఎం సహా 9మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయిన విజయ్ సవాళ్లపై స్వారీ చేయబోతున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనా? కేంద్రంతో చెలిమి ఎలా ఉండబోతోంది? సంకీర్ణ ప్రభుత్వానికి ఐదేండ్లు ఢోకా లేనట్టేనా? కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ తమిళనాట వినిపిస్తున్న ప్రశ్నలు.
సంకీర్ణ సర్కారును
నిలుపుకోవడమే అతి పెద్ద సవాల్
హీరో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడులో మైనారిటీ సర్కారును ఏర్పాటు చేసింది. మ్యాజిక్ ఫిగర్ 118లోని 108 స్థానాలేే టీవీకే పార్టీవి. మిగతావి మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీ(ఐ)ఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలవి. దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూ విజయ్ అధికారంలోకి రావడాన్ని బలమైన ప్రతిపక్షాలుగా మారిన డీఎంకే (59 సీట్లు), ఏఐఏడీఎంకే (47 సీట్లు) సులభంగా అంగీకరించవు. ఏ క్షణంలోనైనా సంకీర్ణంలో చీలిక తెచ్చేందుకు అవి ప్రయత్నించడానికి అవకాశాలూ లేకపోలేదు. స్వల్ప మెజార్టీతో ఉన్న తన సంకీర్ణ సర్కారును ఐదేండ్ల పాటు స్థిరంగా నడపడం విజయ్ ముందున్న అతిపెద్ద సవాలు. ఈ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగాలంటే భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఉండాలి. వాటి మధ్య సమంజసమైన రీతిలో అధికార వికేంద్రీకరణ జరగాలి. కూటమిలోని మిత్రపక్షాలు మంత్రి పదవుల కోసం పోటీపడే అవకాశాలు ఉంటాయి. వాటి డిమాండ్లను గౌరవిస్తూ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అసంతృప్తిని విజయ్ నివారించొచ్చు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరగకుండా తన ఎమ్మెల్యేలను, మిత్రపక్షాలను కాపాడుకోవడం విజయ్‌కు ఒకరకంగా అగ్నిపరీక్ష లాంటిది.
బలమైన ప్రతిపక్షాలను ఎదుర్కోవడం
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర, పటిష్టమైన క్యాడర్ కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే వంటి ద్రవిడ దిగ్గజాలను ప్రతిపక్షాలుగా ఎదుర్కోవడం విజయ్ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన సవాలు. టీవీకేలో విజయ్తో సహా చాలామంది కొత్తవారే. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకేకు ఢీకొట్టడం అంత సులభం కాదు. ఈ రెండు పార్టీలను విజయ్ ఎలా ఢీకొంటారనేది ఆసక్తికరంగా మారింది. డీఎంకే మార్కు ద్రవిడ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా విజయ్ తన లౌకిక సామాజిక న్యాయం – తమిళ జాతీయవాదం లైన్‌ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేవలం పెరియార్, అన్నాదురైలనే కాకుండా కామరాజ్, బీఆర్ అంబేద్క ర్, వేలు నాచియార్ వంటి విభిన్న సిద్ధాంత కర్తల పేర్లను ప్రస్తావించడం ద్వారా ద్రవిడ పార్టీల ఏకస్వామ్యానికి విజయ్ గండి కొడుతున్నారు. ద్రవిడ పార్టీలు తమిళనాడులో అధికారంలో ఉన్న సమయంలో, ప్రతిపక్ష నేతలు గతంలో చేసిన అక్రమాలపై దర్యాప్తు చేయించాయి. ఈ వ్యవహారంలో విజయ్ ఎలాంటి వైఖరిని తీసుకుంటారు అనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. డీఎంకే, ఏఐఏడీఎంకేలు కేవలం రాజకీయ పార్టీలు కావు, అవి బలమైన మీడియా సంస్థలను, వ్యాపార సామ్రాజ్యాలను శాసిస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌ను తట్టుకుని ఐదేండ్ల పాటు నిలబడాలంటే విజయ్ కేవలం సినిమా ఇమేజ్‌పైనే కాకుండా, అత్యంత చాణక్యవంతమైన పరిపాలనపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
కేంద్రంతో సంబంధాలు
కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీని సైద్ధాంతికంగా తానూ వ్యతిరేకిస్తానని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో కేంద్రంతో విజయ్ ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానాన్నీ ఇప్పటికే ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు తమిళనాడు సీఎం హోదాలో కేంద్రంతో విజయ్ ఎలాంటి సంబంధాలను నెరుపుతారు అనేది కీలకమైన ప్రశ్న. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా మనుగడ సాగించాలంటే, సరిపడా నిధులు సమకూరాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న తమిళనాడుకు కేంద్ర సహాయం అత్యంత అవసరం. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు విజయ్ సిద్ధపడతారా లేదా అనేది వేచిచూడాలి. తమిళనాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నందున, విజయ్‌పై కేంద్రాన్ని వ్యతిరేకించాలనే ఒత్తిడి ఉంటుంది.
పాలనపై పట్టు సాధించడం
రాజకీయాల్లో, పరిపాలనలో హీరో విజయ్‌కు ముందెన్నడూ అనుభవం లేదు. కోట్లాది రూపాయల బడ్జెట్, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్న తమిళనాడు బ్యూరోక్రసీని (అధికార యంత్రాంగాన్ని) నడపడం కత్తిమీద సామే. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి సినీ దిగ్గజాలు మొదటిసారి ముఖ్యమంత్రులుగా అయినప్పుడు అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తన కార్యాలయంలో (సీఎంఓ) అత్యంత సమర్థులైన, అవినీతి మరకలు లేని రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అడ్వైజర్లుగా నియమించుకున్నారు. వారి సాయంతో కీలక ఫైళ్లను పరిశీలించారు. బడ్జెట్ రూపకల్పన చేయించారు. విజయ్ సైతం ఇలాగే చేస్తారా ? మరేదైనా కొత్త శైలిలో పాలనాపరంగా ముందుకు సాగుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక తమిళనాడు బ్యూరోక్రసీలో దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే అనుకూల వర్గాలు బలంగా నాటుకుపోయాయి. విజయ్ వారిని ఒక్కసారిగా వేధించకుండా, తటస్థంగా ఉండే అధికారులను ప్రోత్సహిస్తూ క్రమంగా యంత్రాంగాన్ని తన అదుపులోకి తెచ్చుకోవడమే సురక్షితమైన మార్గం.
హామీల అమలు ఎలా?
అన్నింటికంటే ముఖ్యం విజయ్ ఇచ్చిన హామీల అమలు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు అనేది ఇప్పటికే రూ.8.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు మోయలేని భారంగా మారనుంది. ఈ ప్రజాకర్షక హామీలను అమలు చేస్తూనే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ముఖ్యమంత్రిగా విజయ్ ముందున్న అత్యంత సంక్లిష్టమైన టాస్క్. రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందించడం ప్రభుత్వానికి అతిపెద్ద ఖర్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏడాదికి 6 ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇక వ్యవసాయ రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగింపు పథకాలు ఉండనే ఉన్నాయి. ఈ హామీల అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూనే, వాటికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై సీఎం విజయ్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ హామీల అమలులో జాప్యం జరిగితే ప్రతిపక్షాలు డీఎంకే, అన్నా డీఎంకే రాద్ధాంతం చేసే అవకాశాలు ఉంటాయి.
కుల రాజకీయాలు
తమిళనాడు రాజకీయాలను శాసించే కుల సమీకరణాలను హ్యాండిల్ చేయడం హీరో విజయ్‌కు అసలైన అగ్నిపరీక్ష. తమిళనాడులో ఉత్తరాదిన వన్నియార్లు, దక్షిణాన ముక్కులదోర్, పశ్చిమాన గౌండర్లు, రాష్ట్రవ్యాప్తంగా దళితులు బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతంలో కుల రహిత సమాజం అని ప్రకటించినప్పటికీ, ఆచరణలో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులను వన్నియార్, గౌండర్, ముక్కులదోర్, దళిత సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం ద్వారా ఏ ఒక్క వర్గం కూడా దూరం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అన్ని కులాలను బ్యాలెన్స్ చేస్తూ విజయ్ ముందుకు సాగగలరా లేదా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది.
కావేరి నదీ జలాల సమస్య
కర్ణాటకతో ముడిపడి ఉన్న కావేరి నదీ జలాల వివాదం తమిళనాడు డెల్టా రైతులకు జీవన్మరణ సమస్య లాంటిది. కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తమిళనాడుకు దక్కాల్సిన కచ్చితమైన నీటి వాటాను రాబట్టడానికి ఇప్పటివరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు న్యాయపోరాటాలు చేశాయి. టీవీకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీయే, కర్ణాటకలోనూ అధికారంలో ఉంది. ఈ అంశాన్ని సానుకూలంగా మలుచుకొని, కర్ణాటకతో చర్చలు జరిపి కావేరి నదీ జలాల సమస్య పరిష్కారానికి విజయ్ చొరవ చూపుతారా అనేది వేచి చూడాలి.
ప్రజల అంచనాలను అందుకోవడం
తమిళనాడు ప్రజలు దశాబ్దాలుగా వెండితెరపై చూసిన సూపర్ స్టార్ విజయ్‌ను ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అవినీతి అంతమైపోతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యువత, మహిళలు ఆయనపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలను అందుకోవడం విజయ్‌కు అత్యంత కఠినమైన పరీక్ష. ప్రభుత్వ కార్యాలయాలలోని అవినీతి అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీని పరిష్కారానికి విజయ్ ఏవైనా విప్లవాత్మక విధానాలను అమల్లోకి తెస్తారా? అనేది రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. ఐటీ రంగం, తయారీ రంగం, పరిశ్రమల విస్తరణకు టీవీకే కూటమి సర్కారు ప్రోత్సాహాన్ని అందిస్తే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయంలో విజయ్ సర్కారు ఎలాంటి విధానాలతో ప్రజల ఎదుటకు వస్తుందో వేచిచూడాలి.
ప్రధాని సహా పలువురు శుభాకాంక్షలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ కు ప్రధాని నరేంద్రమోడీసహా పలువురు నేతలు అభినందనలు తెలిపారు. విజయ్ పరిపాలన అద్భుతంగా సాగాలని, కేంద్ర ప్రబుత్వం తరపున పూర్తిస్థాయి సహకారాన్ని అందిస్తామని ఎక్స్ లో పేర్కొన్నారు.
వందేమాతర గీత వివాదం
మత ప్రాతిపదికగా ఉన్న నాలుగు చరణాలు పాడటంపై విమర్శలు విజయ్ ప్రమాణ స్వీకార సందర్భంలో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా ఆరు చరణాలతో కూడిన వందేమాతర గీతాన్ని ఆలపించారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు పూర్తి గీతం పాడారు. బీజేపీ తన సైద్ధాంతిక శత్రువు అని ప్రకటించిన విజయ్ ప్రమాణ స్వీకారంలో భారత మాతను దుర్గాదేవితో పోల్చుతూ ఉన్న చరణాలు సైతం ఆలపించడం వివాదాస్పదమైంది. వందేమాతర గీతంలో ఆరు చరణాలు ఉన్నా, దేశమంతటా వినిపించేది రెండు చరణాలే. ఈ గీతాన్ని 1882లో బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠం నవలలో రాశారు. మతాలకు అతీతంగా ఉన్న తొలి రెండు చరణాలు దేశభక్తి భావాన్ని రేకెత్తించాయి. మిగతా నాలుగు చరణాలు తమ మత భావాలను దెబ్బతీస్తున్నాయని ఇతర మతాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అప్పటికే స్వాతంత్య్ర పోరాటంలో ఆలపిస్తున్న ఈ గీతంలో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని ప్రముఖ కవి రవీంద్రనాధ్ టాగూర్ ప్రతిపాదించగా, 1927 నాటి కాంగ్రెస్ సమావేశంలో గాంధీ, నెహ్రూ, వల్లబాయ్ పటేల్ తదితర ప్రముఖులు మద్దతిచ్చి, ఏకగ్రీవంగా తీర్మానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగ నిర్ణాయక సభ సైతం రెండు చరణాలనే పాడాలని నిర్ణయించింది. నాటి నుంచి జన్‌సంఘ్, ఆ తరువాత అభ్యంతరం చెబుతూ వచ్చాయి. జాతీయ గీతానికి ముందు వందేమాతరం ఆరు చరణాలను తప్పనిసరిగా పాడాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించగా, సిపిఎం, వామపక్షాలు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. వందేమాతర గీతం వివాదం కావడం ఇష్టం లేకే విజయ్ ప్రమాణ స్వీకారంలో అంగీకరించారని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎందుకు పాడలేదు?
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వందేమాతర గేయంలోని ఆరు చరణాలు కాదు కదా… రెండు చరణాలు కూడా ఆలపించలేదు. జాతీయ గీతం జనగణమన మాత్రమే పాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన సభలో ఆలపించకుండా, ద్రవిడ పార్టీలు, ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించే వందేమాతర గేయంలోని చివరి నాలుగు చరణాలు తమిళనాడులో ఆలపించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే ఇలా చేశారని ఆయా పార్టీలు విమర్శిస్తున్నాయి. జాతీయ గీతాన్ని, వందేమాతరాన్ని రాసింది బెంగాలీ కవులే అయినా, బీజేపీ ఇలా రాజకీయం చేయడం శోచనీయమని డిఎంకె సహా పలు పార్టీలు విమర్శించాయి. నిజంగా బీజేపీకి ఆసక్తి లేకపోవడం వల్లే బెంగాల్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు పాటించలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సీపీఐ(ఎం) అభినందనలు
ఆదివారం ఎక్స్ వేదికగా సీఎం విజయ్ కు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి అభినందనలు తెలిపారు. “తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు తిరు సి. జోసెఫ్ విజయ్ కు అభినందనలు. లౌకికవాదం, ప్రజా సంక్షేమం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం సూత్రాలను నిలబెడుతుందని, తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తూ.. మీకు, మీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు ” అని పేర్కొన్నారు.



