‘చలో అదానీ గంగవరం పోర్టు’ ఉద్రిక్తం

– ఇసుప కంచెలను దాటుకుంటూ దూసుకెళ్లిన వైనం
– మా భూముల్లో నిర్మించిన పోర్టుపై అదానీ పెత్తనమేంటని ఆగ్రహం
– జీతాలు, ఇతర సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
– తీవ్ర పోలీసు నిర్బంధం, లారీచార్జి
విశాఖపట్నం: జీతాలు పెంచాలని, ఇతర సమస్యలనూ పరిష్కరించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఆధ్వర్యాన విశాఖపట్నంలో గురువారం తలపెట్టిన ‘చలో అదానీ గంగవరం పోర్టు’ కార్యక్రమానికి వేలాదిగా కార్మికులు కుటుంబాలతో తరలివచ్చారు. పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించినా వెరవకుండా ఇనుప కంచెలను దాటుకుంటూ పోర్టు మెయిన్‌ గేటు వద్దకు దూసుకెళ్లారు. ఆద్యంతం తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోర్టు ముట్టడి కార్యక్రమం సాగింది. పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో కొందరు కార్మికులకు గాయాలయ్యాయి. మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సాగిన ఈ కార్యక్రమంలో అదానీ పోర్టు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున కార్మికులు నినాదాలు చేశారు. తమ భూముల్లో పోర్టు కట్టి.. తమపైనే పెత్తనం ఏంటని మండిపడ్డారు. తొలుత పోర్టు కార్మికులు పెదగంట్యాడలోని తమ దీక్షా శిబిరం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్టుకు మహా ప్రదర్శనగా బయలుదేరారు. పోలీసులు ఆ మార్గంలో మూడు చోట్ల ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. అవేవీ కార్మికుల పోరును ఆపలేకపోయాయి. సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ బి.గంగారావు, బి.జగన్‌, నాయకులు కొవిరి అప్పలరాజు, వైసీపీ గాజువాక ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన కార్పొరేటర్‌ దల్లి గోవింద కార్మికులకు మద్దతు తెలిపి వారిని ముందుకు నడిపించారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. కార్మికులు గాయపడ్డారు. ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు ఎంత నిర్బంధం ప్రయోగించినా కార్మికులు వెనక్కి తగ్గకుండా భుజం భుజం కలుపుతూ ఐక్యంగా పోర్టు మెయిన్‌ గేటు వరకూ దూసుకెళ్లారు. జీతాలైనా పెంచండి.. మా సముద్రాన్నైనా మాకు ఇచ్చేయండి అని డిమాండ్‌ చేశారు. అక్కడకు ఆర్‌డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ చేరుకున్నారు. నాయకులతో మాట్లాడిన అనంతరం ఆయన పోర్టు యాజమాన్యంతోనూ చర్చించారు. అదానీ పోర్టు యాజమాన్యం కొన్ని సమస్యలను పరిష్కరిస్తుందంటూ ఆయన చెప్పుకురాగా కార్మికులు సంతృప్తి చెందలేదు. అవసరమైతే గేటును బద్దలు కొట్టుకుని లోపలకు వెళ్తామని నినదించారు. ఆర్‌డీఓ స్పందిస్తూ సమస్యలను వినతిపత్రం రూపంలో తనకు ఇవ్వాలని కోరగా కార్మికులు అలాగే చేశారు. వాటిపై పోర్టు యాజమాన్యం నాలుగు రోజుల సమయం కావాలని అడిగింది. దీంతో కార్మికులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే మళ్లీ పోర్టును ముట్టడిస్తామని హెచ్చరించారు. పోర్టు ముట్టడి నేపథ్యంలో తలెత్తిన తోపులాటలో కొద్ది మంది పోలీసులకూ గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జిని సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ ఖండించారు.

Spread the love