– న్యాయం జరిగే వరకు పోరాడుతామన్న మహిళలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
గృహలక్ష్మి పథకం పూర్తిగా అవకతవకల మయమై ఉందని శనివారం చల్వాయి ప్రజలు 163 వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అంతేకాక గ్రామపంచాయతీ కార్యాలయం ముందు టెంట్ వేసి జాబితాను సవరించే వరకు రిలే నిరాహారతులు దీక్షలు చేస్తామని భీష్మించుకున కూర్చున్నారు. ఈ సందర్భంగా చల్వాయి గ్రామ ప్రజలు మాట్లాడుతూ పక్క భవంతులు ట్రాక్టర్లు ఎకరాలకు ఎకరాలు పొలాలు ఉన్న టిఆర్‌ఎస్ కార్యకర్తలకే గహలక్ష్మి పథకాన్ని వర్తింపజేశారని ఆరోపించారు. అధికారులు తాము సర్వే మాత్రమే చేశామని జాబితా గురించి తమకు తెలియదని చెప్పడం జాబితాను ఎవరు తయారు చేశారో తేటతెల్లం అవుతుందని అన్నారు. గ్రామంలో సుమారు 400 మందికి పైగా గహలక్ష్మి పథకం కొరకు దరఖాస్తు చేసుకోగా వీరిలో కేవలం 30 మందిని అనర్హుల గురించి 370 మందిని అర్హులుగా పేర్కొంటూ నివేదికలు పంపినట్లు పంచాయతీ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వచ్చిన జాబితా తమకు ఎలాంటి సంబంధం లేదని అది కలెక్టర్ కార్యాలయం నుండి రావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమాధానంతో సంతప్తి చెందని మహిళలు సర్పంచి వచ్చి వార్డు సభ్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉన్న జాబితాను రద్దుచేసి ప్రకటించాలని అప్పటివరకు తమ నిరసన కొనసాగుతుందని అన్నారు. రాస్తారోకో చేస్తున్న వారిని పసర పోలీసులు సమజాయించి రాస్తారోకోను విరమింపజేశారు. పాకల్లో పూరి గుడిసెల్లో పరదాలు కట్టుకొని కాపురాలు చేస్తున్న వారిని కాదని పక్కా భవనాలు ఉన్న వారిని ఎలా ఎంపిక చేశారని ప్రజలు ఆగ్రహించారు. పంచాయతీ కార్యదర్శి ఒక దశలో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా తాము దీక్షను విరమించేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. అసలైన అర్హులను గుర్తించి గహలక్ష్మి వర్తింపజేసే వరకు తమ ఆందోళన పోరాటాలను ఆపబోమని మహిళలు ముక్తకంఠంతో తెలిపారు.