చాంపియన్స్‌ ట్రోఫీ కళ తప్పనుందా?

Champions Trophy Is art wrong?– మెగా ఈవెంట్‌కు స్టార్‌ క్రికెటర్లు దూరం
– ఎనిమిది జట్లకూ గాయాల బెడద
ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ చాంపియన్స్‌ ట్రోఫీ. ప్రపంచ మేటి ఎనిమిది జట్లు మాత్రమే పోటీపడే ఈ మెగా టోర్నమెంట్‌ బుధవారం నుంచి షురూ కానుంది.
రసవత్తర చాంపియన్స్‌ ట్రోఫీ వేటలో ఎనిమిది జట్లకూ గాయాల సెగ తగిలింది. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ సహా అన్ని జట్లు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయాయి. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా లేకుండానే టీమ్‌ ఇండియా బరిలో నిలువగా.. తొలి ప్రాధాన్య పేస్‌ బౌలర్లు లేకుండానే కంగారూలు ఆడనున్నారు. ప్రత్యేకించి బంతితో స్టార్‌ క్రికెటర్లు దూరమవగా చాంపియన్స్‌ ట్రోఫీ కళ తప్పనుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
సమవుజ్జీలు తలపడితేనే సమరం రక్తికడుతుంది. ఉత్తమ బౌలర్‌ను ఎదుర్కొన్నప్పుడే ఉత్తమ బ్యాటర్‌ నైపుణ్యాలను చూడగలం. ఏ రెండు జట్లు పోటీపడినా.. కచ్చితంగా ఇటువంటి ముఖాముఖి సవాళ్లు అభిమానుల్లో ఆసక్తి రేపటంతో పాటు ఆటను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఐసీసీ 2025 చాంపియన్స్‌ ట్రోఫీ బుధవారం ఆరంభం కానుండగా.. ఈ తరహా సమవుజ్జీల సమరం ఆశించిన స్థాయిలో ఉండవనే అంచనాలు ఉన్నాయి. చాంపియన్స్‌ ట్రోఫీ వేటలో అగ్ర జట్లు కీలక బౌలర్ల సేవలను కోల్పోయాయి. అన్ని జట్లు బౌలింగ్‌ బలం కంటే బ్యాటింగ్‌ బలంతోనే పైచేయి సాధించాలనే ప్రణాళికతో కనిపిస్తున్నాయి.
బూమ్‌బూమ్‌ లేకుండానే
భారత జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర జశ్‌ప్రీత్‌ బుమ్రా పోషిస్తాడు. అతడి చేతిలో బంతి ఉండగా టీమ్‌ ఇండియా ఎప్పుడూ గెలుపు వేటలో ముందంజలోనే నిలుస్తోంది. ఆస్ట్రేలియాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఆఖరు టెస్టులో వెన్నునొప్పికి గురైన బుమ్రా.. మైదానానికి దూరం అయ్యాడు. ఐదు వారాల విశ్రాంతి అనంతరం సైతం బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించలేదు. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ జట్టు నుంచి తప్పుకున్నాడు. బుమ్రా గాయంతో పేస్‌ దళపతి సేవలు లేకుండానే భారత్‌ దుబారుకి చేరుకుంది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. నేరుగా చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటు సాధించిన యశస్వి.. విజయంలో ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ నాగ్‌పూర్‌ వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపులు యశస్వి చోటును గల్లంతు చేశాయి. ధనాధన్‌ ఓపెనింగ్‌ హిట్టర్‌ పక్కనపెట్టి భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ వేటకు సిద్ధమైంది.
పేస్‌ విభాగం ఖాళీ
ఆస్ట్రేలియా తొలి ప్రాధాన్య పేసర్లు అందరూ టోర్నీకి దూరమయ్యారు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆశించిన సమయానికి ఈ ఇద్దరూ కోలుకోలేదు. మిచెల్‌ స్టార్క్‌ వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా.. మార్కస్‌ స్టోయినిస్‌ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. మిచెల్‌ స్టార్క్‌ వెన్నునొప్పితో తప్పుకున్నాడు. ప్రాథమికంగా ఎంపిక చేసిన జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు దూరం కావటంతో.. ఆసీస్‌ సెలక్షన్‌ కమిటీ మరో ఐదుగురు ఆటగాళ్లను పాకిస్థాన్‌కు పంపించింది.
కివీస్‌కు అనూహ్యంగా
చాంపియన్స్‌ ట్రోఫీ సన్నాహక సిరీస్‌ న్యూజిలాండ్‌కు కష్టాలు తీసుకొచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా రచిన్‌ రవీంద్ర నుదుటికి బంతి బలంగా తగిలింది. భీకర ఫామ్‌లో ఉన్న రచిన్‌ రవీంద్ర పాక్‌ పిచ్‌లపై కివీస్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌. గాయంతో ఇబ్బంది పడుతున్న లాకీ ఫెర్గుసన్‌, బెన్‌ సీయర్స్‌లతో పాటు రచిన్‌ రవీంద్ర సైతం చాంపియన్స్‌ ట్రోఫీకి దూరం అయ్యాడు.
ఆతిథ్య పాకిస్థాన్‌కు సైతం గాయాల బెడద తప్పలేదు. పేసర్‌ హరీశ్‌ రవూఫ్‌ ఫిట్‌నెస్‌ కోసం ఆ జట్టు వైద్య బృందం శాయశక్తులా కష్టపడుతోంది. దక్షిణాఫ్రికా జట్టులో ఎన్రిచ్‌ నోకియా గాయంతో గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఆటకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే అంచనాతో ఎంపిక చేసినా.. సాధ్యపడలేదు. యువ పేసర్‌ గెరాల్డ్‌ కోయేట్జిని నోకియా స్థానంలో జట్టులోకి ఎంచుకోగా అతడూ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ జాకబ్‌ బెతెల్‌ భారత పర్యటనలో గాయం బారిన పడి చాంపియన్స్‌ ట్రోఫీ జట్టు నుంచి తప్పుకున్నాడు. అఫ్గనిస్థాన్‌ ఆటగాళ్లలో ఏఎం ఘజాన్‌ఫర్‌ గాయంతో దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌ను సైతం గాయాలు వెంబడించినా.. ప్రాథమికంగా ఎంపిక చేసిన జట్టులో ఎవరూ దూరం కాలేదు.
చాంపియన్స్‌ ట్రోఫీ వేటలో నిలిచిన జట్లు
గ్రూప్‌-ఏ : భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌
గ్రూప్‌-బి : అఫ్గనిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా

Spread the love