ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలపై సీఎస్‌, డీజీపీలతో చంద్రబాబు భేటీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. శనివారం తన నివాసంలో సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంవో ఇప్పటికే సిద్ధం చేసింది. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు సమాచారం.
వైకాపాతో అంటకాగిన వారిని ప్రభుత్వం దూరంగా పెట్టనున్నట్లు సమాచారం. ప్రవీణ్ ప్రకాశ్‌, శశి భూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేసేలా ఆదేశాలిస్తారని చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్‌లు రాజేంద్రనాథ్‌ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్.సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. తితిదే ప్రక్షాళనతో పని మొదలు పెట్టిన చంద్రబాబు.. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

Spread the love