చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం

Chandrababu The arrest was unfortunate– ఈ వయసులో అలా చేయటం సరికాదు
– సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
– మన అభివృద్ధిని కీర్తించారంటూ వ్యాఖ్య
– కాంగ్రెస్‌, బీజేపీకి దూరదృష్టి లేదని విమర్శ
నవ తెలంగాణ – సిద్దిపేట, నంగునూరు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేయడం దురదృష్టకరమని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం సరికాదు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మించనున్న ఆయిల్‌పామ్‌ కర్మాగారానికి శనివారం మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో ఆంధ్రాలో ఒక ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో వందల ఎకరాల భూమి కొనేవారమని, నేడు పరిస్థితి మారిందని ఆంధ్రాలో వందల ఎకరాల భూములు అమ్మితే తెలంగాణలో ఎకరా భూమి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట అన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చిందని, రాష్ట్రంలో జై జవాన్‌ జై కిసాన్‌ అనే నినాదాన్ని నిజం చేశారని అన్నారు. రైతులను లక్షాధికారులను చేయాలని నాటి నినాదమని, అది నేడు కేసీఆర్‌ వల్ల నిజమైందని అన్నారు. 50 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఎర్రబారిన నేలలు మిగిలాయని, గాలిలో దీపం లాగా కరెంటు ఉండేదని, సిగ్గు లేకుండా కాంగ్రెస్‌ నాయకులు కరెంటు సరఫరా పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నేడు కేసీఆర్‌ పాలనలో నీటి తీరువాలేదని, కరెంటు బిల్లులు లేవని, ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్నామని, ఒక గుంట భూమి పంట ఎండిందా అని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌ పాలకులకు సోయి లేదు బీజేపీ, కాంగ్రెస్‌ పాలకులకు సోయిలేక, దూరదృష్టి లేకపోవడంతోనే ప్రతి సంవత్సరం రూ.1.56 కోట్ల విలువైన మంచి నూనెను దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఒక వ్యక్తి సంవత్సరానికి 19 కిలోల నూనె వాడుతున్నాడని, అందులో 40 శాతం మనదేశంలో ఉత్పత్తి అయితే, 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అందుకు గత పాలకులకు ముందుచూపు లేకపోవడమే కారణమని అన్నారు. మన కూరల్లోకి విదేశీ నూనెలను ఉపయోగించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే సతీష్‌, ఎఫ్డిసి చైర్మెన్‌ ప్రతాపరెడ్డి, ఆయిల్‌ పెడ్‌ కమిషనర్‌ హనుమంతరావు, ఎండి సురేందర్‌ రెడ్డి, చైర్మెన్‌ రామకృష్ణారెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love