కాంగ్రెస్‌ మాటలు సంతకం లేని డెబిట్‌ చెక్కుల్లాంటివి

The words of the Congress are unsigned Like debit cheques– ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం
– అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కాంగ్రెస్‌
– పెద్ద శంకరంపేటలో డబుల్‌ బెడ్‌రూమ్‌లను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ పెద్ద శంకరంపేట
‘కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాటలు సంతకం లేని డెబిట్‌ చెక్కులాంటివని, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని, వారి మాటలను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేటలో రూ.564 లక్షలతో నిర్మించిన 96 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను ఆయన ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పేరు ఢిల్లీ నుంచి రావాల్సి వస్తుందని, అందుకే ఆరు నెలలకో సీఎం మారతారన్నారు. అలాగే, ఆరు నెలలకోసారి కర్ఫ్యూ, ఆరు గంటల కరెంటు మాత్రమే ఉంటుందని తెలిపారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్‌ హాలిడే ఉంటుందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలో ఉందని అక్కడ కేవలం రూ.600 పింఛన్‌ మాత్రమే ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మోసపూరిత మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో చేయని అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవన్నారు. కాళేశ్వరం నీటిని పెద్ద శంకరంపేట మండలంలోని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి అందిస్తామని హామీ ఇచ్చారు. సబ్‌ మార్కెట్‌ యార్డ్‌ను ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు నూతన పూర్తిస్థాయి మార్కెట్‌ యార్డుగా తొందరలో ప్రకటిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో త్వరలో వస్తుందని, చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. నారాయణఖేడ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అన్ని కేసులు, కొట్లాటలే తప్ప అభివద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణఖేడ్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love