పార్టీ పనితీరులో మార్పులు చేయాల్సిందే..

Changes have to be made in the performance of the party.– నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో మేమే ముందంజలో ఉన్నాం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా రాబోయే లోక్‌సభ ఎలక్షన్లకు సంబంధించి పార్టీ పనితీరులో కచ్చితంగా మార్పులు చేర్పులు చేయాల్సిందేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అంగీకరించారు. వాటిని కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా కచ్చితంగా మార్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి హాజరైన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపోటములు బీఆర్‌ఎస్‌కు కొత్త కావని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు గట్టిగా కృషి చేయాలని కోరారు. తద్వారా అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌, బీజేపీకన్నా బీఆర్‌ఎస్‌ ముందుజలో ఉందని తెలిపారు. ఈసారి అక్కడ త్రిముఖ పోరు జరగనుందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ అడ్డగోలుగా హామీలనిచ్చిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా విమర్శించారు. అనేక వాగ్దానాలపై ఇప్పటికే ఆ పార్టీ దాటవేత ధోరణిని అవలంభిస్తోందని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతిపై తప్పించుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అప్పులు, శ్వేతపత్రాల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోని గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తామంటూ సర్కారు ప్రకటించిందని అన్నారు. దళితబంధుపై ముఖ్యమంత్రి రేవంత్‌ నోరు మెదపటం లేదని చెప్పారు. రైతుబంధుపై ప్రభుత్వం అన్నదాతలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి పథకాలను రద్దు చేస్తే బాధితులతో కలిసి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజూ ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టలేదని తెలిపారు. కానీ ప్రజాపాలన పేరిట కాంగ్రెస్‌ సర్కారు జనాన్ని వరసల్లో నిలబెట్టి, ఇబ్బందుపాల్జేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజా దర్బార్‌ కాదు.. డ్రామా దర్బార్‌… : మాజీ మంత్రి వేముల
ప్రజా దర్బార్‌ పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం డ్రామా దర్బార్‌ను నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ ఎంతమంది సమస్యలను పరిష్కరించారనే విషయమై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ ఎంపీ స్థానంపై సమీక్ష అనంతరం సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేముల మాట్లాడారు. కొత్త జిల్లాలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి, నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. కానీ కేసీఆర్‌ మీద అక్కసుతో సీఎం రేవంత్‌ జిల్లాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన వాటన్నింటినీ రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలను ముట్టుకుంటే తేనె తుట్టెను కదిలించినట్టేనని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love