రేగళ్ళ గుంపులో చెలం నీరు

– ఆదివాసీల అరణ్య రోదన…
– వలస గిరిజనులకు నీటి ఇక్కట్లు…
– చెలం నీరే ఆధారం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అటవీ ప్రాంత ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక,కార్యాచరణకు యంత్రాంగం ఉన్నా వారి వేదన అరణ్య రోదనే అవుతుంది. ప్రతీ ఇంటికీ నల్లా తో శుద్ది జలం అందిస్తున్నాం. అని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు టీవీ లో ప్రకటనలు,పత్రికల్లో ప్రచారం చేస్తున్నా వారికి నేటికీ చెలంనీరే దాహార్తిని తీరుస్తుంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. అశ్వారావుపేట నియోజక వర్గం,అశ్వారావుపేట మండలం,బచ్చువారిగూడెం పంచాయితీ పరిధిలోని రేగళ్ళ గుంపు లో చెలం నీరే ఆధారంగా ఉంది. ఈ గ్రామం పంచాయితీ కేంద్రం అయిన బచ్చువారిగూడెం కు 7 కి.మీ దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది.ఇక్కడ 32 కుటుంబాలకు వలస గిరిజనులు దశాబ్దం క్రితం ఆవాసాలు ఏర్పరుచుకున్నారు.పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తారు.122 మంది జనాభా ఉంటుంది.ఈ గ్రామానికి సరైన నడక మార్గం లేదు.ఐటిడిఏ సోలార్ విద్యుత్ తో నిర్వహించే చేతి పంపు నిర్మించినప్పటికీ అది పనిచేయడం లేదు.దీంతో అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్దంగా ఏర్పడిన చెలం నీరే వీరి దాహార్తి ని తీరుస్తుంది.ప్రభుత్వం నీటి సౌకర్యం కల్పించాలని అమాయక అటవీ ప్రజలు వేడుకుంటున్నారు. నాట్ ఫీజుబులిటీ ఏరియా కావడమే కారణం : మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ లక్ష్మిఈ గ్రామానికి మిషన్ భగీరథ నీటి సౌకర్యం లేకపోవడానికి కారణం ఏమిటని ఆ శాఖ ఏఈ లక్ష్మి ని ప్రశ్నించగా “దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నందు నాట్ ఫీజుబులిటీ ఏరియా కారణంగా అక్కడ వరకు నీటి సరఫరా చేయలేకపోతున్నామని” అన్నారు. అటవీ శాఖ అనుమతులు కోసం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని,వారి అనుమతులు రాగానే నీటి సౌకర్యానికి కృషి చేస్తామని అన్నారు.
Spread the love