– సూపర్‌జెయింట్స్‌పై సూపర్‌కింగ్స్ గెలుపు
– ఛేదనలో మెరిసిన ధోని, దూబె, రషీద్
ఎట్టకేలకు చెన్నై సూపర్‌కింగ్స్ ఓ విజయం సాధించింది. ఐపీఎల్18లో వరుసగా ఐదు పరాజయాల తర్వాత చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్ గెలుపొందింది. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో ఎం.ఎస్ ధోని (26 నాటౌట్), శివం దూబె (43 నాటౌట్) మెరవటంతో సూపర్‌జెయింట్స్‌పై సూపర్‌కింగ్స్ పైచేయి సాధించింది.
నవతెలంగాణ-లక్నో
ఎం.ఎస్ ధోని (26నాటౌట్, 11 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), శివం దూబె (43 నాటౌట్, 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఛేదనలో కదం తొక్కారు. పరుగుల వేట కష్టమైన లక్నో పిచ్‌పై సూపర్‌జెయింట్స్ బౌలర్లపై సూపర్‌కింగ్స్ బ్యాటర్లు పైచేయి సాధించారు. 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి168 పరుగులు చేసిన సూపర్‌కింగ్స్ మరో మూడు బంతులు ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తెలుగు తేజం షేక్ రషీద్ (27, 19 బంతుల్లో 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర (37, 22 బంతుల్లో 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం చేశారు. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7), విజరు శంకర్ (9) నిరాశపరచినా.. శివం దూబె, ఎం.ఎస్ ధోని మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (63, 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది.
రాణించిన రిషబ్ పంత్ :
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సూపర్‌జెయింట్స్ ఆశించిన ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు ఎడెన్ మార్‌క్రామ్ (6), మిచెల్ మార్ష్ (30) సహా నికోలస్ పూరన్ (8) నిరాశపరిచారు. మిచెల్ మార్ష్ పవర్‌ప్లే తర్వాత సైతం క్రీజులో నిలిచినా దూకుడుగా ఆడటంలో విఫలం అయ్యాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (63) సైతం దూకుడుగా ఆడలేకపోయాడు. సీజన్ ఆరంభం నుంచీ విఫలమవుతున్న పంత్ బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై ఎదురుదాడి చేయలేదు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిసిన పంత్ 42 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఆఖరు వరకు క్రీజులో నిలిచిన పంత్ చివరి రెండు ఓవర్లలోనే సిక్సర్లు కొట్టడం మొదలెట్టాడు!. ఆయుశ్ బదాని (22, 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (20, 11 బంతుల్లో 2 సిక్స్‌లు) మెరవటంతో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది.