– రూ.5.90 లక్షల నిధులతో పనుల ప్రారంభం
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామ పరిధిలో ఉన్న చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులను శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు. రూ.5.90 లక్షల వ్యయంతో సుమారు 1.50 కిలోమీటర్ల మేర కాలువ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు అలుగు కాలువకు పలు చోట్ల గండ్లు ఏర్పడటంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని చెప్పారు. ఆ నిధులతో గండ్లు పూడ్చడంతో పాటు కాలువను బలోపేతం చేసి భవిష్యత్తులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సరిహద్దులు పోలయ్య, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు, నీటి పారుదల శాఖ డీఈ ఎస్.వెంకటేశ్వర్లు,ఏఈ లు ఎల్.శ్రీనివాస్,ఎస్ కే రియాజ్ ,కాంగ్రెస్ మండల తాజా మాజీ అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, తుమ్మ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు కొనకళ్ళ చెన్నారావు, కొల్లు చంద్రశేఖర్, తెల్లగొర్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.



