బాల సాహిత్య కవితాలత ‘నాగలత’

సిద్ధిపేట బాల సాహితీవేత్తలకు ఆలవాలంగా ఉన్నప్పటికీ అటు కవిత్వం, ఇటు బాల సాహిత్యం, మరోవైపు పద్యం, కథ, విమర్శ వంటి రంగాల్లోనూ అక్కడి బాల సాహితీవేత్తలు సమానంగా పనిచేయడం చూడవచ్చు. ఈ కోవలోనే ఉపాధ్యాయినిగా బాధ్యతలు నిర్వహిస్తూ కవయిత్రిగా, బాల సాహితీవేత్తగా రాణిస్తున్న కవయిత్రి, రచయిత్రి దుడుగు నాగలత. నాగలత 12 మే, 1985న కామారెడ్డి జిల్లా బీబిపేటలో పుట్టింది. దుడుగు నాగలత అమ్మానాన్నలు శ్రీమతి దుడుగు రుకుంబాయి-శ్రీ వెంకటేశం. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి, నాగలత పుట్టిన బీబిపేటలోనే యాభైవేల పేజీల వేద సాహిత్యాన్ని కూర్చిన సిద్ధాంతాచార్య, తెలంగాణ ప్రసిద్ధ రచయిత లోక మలహరి ఎనభై అయిదేండ్ల కింద పుట్టారు.

వృత్తిరీత్యా కామారెడ్డి జిల్లా చీనూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు భాషోపధ్యాయినిగా పనిచేస్తున్న నాగలత కవయిత్రి, బాల సాహితీవేత్త. తెలుగు పద్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా రాసే నాగలత వచన కవిత్వాన్ని అంతే ప్రేమగా రాస్తుంది. అన్ని ప్రముఖ పత్రికల్లో ఈమె కవితలు అచ్చయ్యాయి. ఓటరు చైతన్యం కోసం, మాతృదినోత్సవం వంటి సందర్బాల్లో ఈమె రాసిన కవితలు ప్రశంసలు పొందాయి. ‘సిరిమంజరి’ అర్థ శతకం, సిరిమంజరి రూపంలో నూటా యాభై కవితలు, రాగరీతి పద్యాలు వంటివి నాగలత వివిధ మాధ్యమాల సంస్థల కోసం చేసిన ఆన్‌లైన్‌ రచనలు.
కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో రామోజీ ఫౌండేషన్‌ నిర్వహించిన ప్రతిరోజు కవితల పోటీ నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ రోజువారి పోటీల్లో దుడుగు నాలత ఒకసారి ద్వితీయ బహుమతి, రెండుసార్లు ప్రోత్సాహక నగదు బహుమతులు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ‘రుతుప్రేమ’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కవిసమ్మేళనంలో జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి, నగదు పురస్కారం గెలుచుకుంది. ఇవే కాక చిత్తూరు ఉషోదయ పురస్కారం, సిరిమంజరి కవిరత్న, అమ్మానాన్న సాహితీ సేవాసంస్థ పురస్కారం, మల్లినాథసూరి కళా పీఠం ‘ఫెంటాస్టిక్‌ పోయెట్‌ పురస్కారం’, కవిచక్ర వంటి బిరుదులు పొందారు. కోవిడ్‌ సమయంలో నిర్వహించిన దాదాపు రెండు వందలకు పైగా అంతర్జాల కార్యక్రమాలలో నాగలత పాల్గొని ప్రశంసలు పొందింది. తాను స్వయంగా కవయిత్రిగా రాణిస్తూనే పనిచేసిన ప్రతిచోట పిల్లలతో రచనలు చేయిస్తున్న బాల వికాసకార్యకర్త నాగలత.
అచ్చయిన దుడుగు నాగలత రచనల్లో మొట్టమొదటి రచన ‘చెంగుచెంగున…’ బాల గేయ సంపుటి. ఈ పుస్తకం చక్కని ప్రశంసలనే కాదు ‘పెందోట బాల గేయ సాహిత్య పురస్కారం’ కూడా గెలుచుకుంది. ‘ఆడుతూ పాడుతూ’ బాలలు గడపాలన్నదీ ఈ పాటల పంతులమ్మ ఆశ… ఆకాంక్ష. అచ్చంగా అవి ప్రతి గేయంలో కనిపిస్తాయి కూడా! చదువు కూడా అలాగే ఆడుడూ, పాడుతూ చదవాలంటుందీమె! ‘..అక్షరాలను మనమంతా/ ఆడుతు పాడుతు నేర్చుకుందాం/ …భావిపౌరులం మనమంతా/ బంగరు భవితకు పునాది వేసేద్దాం’ అని చెబుతూనే… ‘బాలల్లారా! బంగారు కొండల్లారా! ఆడుతు పాడుతు ఎగురుతు దుంకుతు/ హాయిగ కాలం గడిపేద్దాం/ నేస్తాలందరి దరికిచేరి/ అల్లరి అల్లరి చేసేద్దాం’ అంటుంది. పిల్లలు తొలినాళ్ళ నుండే పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉంటే లోకం నంనదవనం అవుతుందని భావించిన నాగలక్ష్మి ‘వనములనే పంచండీ హాయిగా’ అని తన గేయంలో కీర్తిస్తుంది. ఇంకా, ‘శుభ్రతను పాటించండి/ శుభమే కలుగును మనకండి’ అంటూ పంతులమ్మ లాగా, అమ్మలాగా పిల్లలకు ఆరోగ్యపు అలవాట్లను, పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తుంది. అవును మరి ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ కదా. తెలంగాణ ఆడపడుచు దుడుగు నాగలక్ష్మి, మరి బతుకునిచ్చే బతుకమ్మ గురించి రాయకుండా ఎలా ఉంటది. ‘బతుకమ్మ పండుగ వచ్చెనంట/ పూలన్నీ విరగపూసేనంట/ గునుగు తంగేడుపూలతోటి/ బతుకమ్మనే చేసెదరంట’ అంటూ బతుకునిచ్చే తల్లిని గురించి బాలలకోసం రాసింది. ధాన్యరాశిని గురించి, విత్తనాలు విత్తడం, మొలకెత్తడం గురించి రాసిన కవయిత్రి చేతివృత్తుల గురించి రాయడం బాగుంది. ‘మగ్గాలు మూలబడె/ పద్మశాలి కూలబడె/ చేనేత జాడలేక/ నేతన్న కుంటుబడె’ అని ఆవేదన చెందుతూనే… ‘చేతి వృత్తుల వారందరిని/ క్షేమంగా బతకనిద్దాం’ అని సహానుభూతిని వ్యక్తం చేస్తుంది. పండుగల గురించి, ఊరు గురించి, చెరువు గురించి, అమ్మ, పక్షుల గురించి బాలల కోసం రాసిన నాగలత ఉపాధ్యాయిని కదా! పాటగా పాఠం కూడా రాసింది. ‘అమ్మ మాట వినాలి/ ఆటవిడుపు కావాలి’ అనే అచ్చులపాట, ‘చక్కని చుక్క మా పాప/ పాలబుగ్గ పూవుమొగ్గ’ అనే ఒత్తులపాట అటువంటిదే. కథ, కవిత్వం, గేయం, వచన కవిత్వం, పద్యం యిలా అన్ని కవితా రూపాల్లో తనదైన విధంగా రాస్తున్న దుడుగు నాగలత పిడుగుల్లాంటి పిల్లల కోసం తాయిలంగా తెచ్చిన గేయ సంపుటి ‘చెంగు చెంగున’ బాల గేయాలు. అభివ్యక్తి, వస్తువు, లయ కలగలిపితే దుడుగు నాగలత… ఆమె గేయాలు… జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548.

Spread the love