ఎల్లమ్మ చెట్టు

మా ఇంటి వెనకాల మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. దాన్ని మేం దుబ్బ చేను అంటాం. దాని కింది భాగంలో ఒక బావి ఉంది. ఆ బావి పక్కన ఒక గిన్నె చెట్టు, మేడిచెట్టు ఉన్నాయి. బాయి గడ్డ మీద వామన గుంటలు తీశాం. అప్పుడప్పుడూ నేను, అన్నయ్య వామన గుంటలు ఆడతాం. మేడి, గిన్నె పండ్లు పండినప్పుడు రాలుపుకొని తింటాం. మా స్నేహితులకు కూడా పెడతాం. దుబ్బు చేనుకు, మా ఇంటికి మధ్య పెద్ద వేప చెట్టు ఉంది. దాన్ని మా తాత, పెళ్ళయిన కొత్తలో, తనకు ఇచ్చిన నూటా ఇరవై రూపాయల కట్నంతో గుర్తుగా ఆ భూమి కొనగానే వేశాడట. దాని కింద ఎల్లమ్మ గుడి ఉంది. అందుకే దాన్ని, ఎల్లమ్మ చెట్టు అంటుంటాం. మా తాత కాలంలోనే ఎల్లమ్మ గుడిని నిలిపారట. చుట్టూ నాలుగు బండలు, మధ్యలో ఒక రాయి పెట్టి, ఆ రాయే ఎల్లమ్మ తల్లి అని చెప్పారు. నాకు నమ్మాలనిపించలేదు. ఎందుకంటే దేవత అంటే, కాళ్లు చేతులు తల ఉండాలి కదా! అదేమీ లేకుండా ఉట్టిదే ఒక రాయి పెట్టి దానినే ఎల్లమ్మ అంటుంటారు. జనమంతా నమ్ముతుంటారు. ప్రతి ఏడాది ఎల్లమ్మ తల్లికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, బోనం చెల్లిస్తారు. ఆ చిన్న గుడికి సున్నం వెయ్యమంటే తాటి మట్టను మూరెడు నరికి, మెత్తగా దంచి భ్రష్‌ లా చేసి నేనే సున్నం వేస్తాను. అప్పుడప్పుడు తాతయ్య మంచం తీసుకుని వెళ్లి వేప చెట్టు కింద వేసుకొని పడుకుంటాడు. ఎందుకలా అంటే, ”మీ నాయనమ్మ చెప్పింది రా. వేప చెట్టు గాలి చాలా మంచిదట ఆరోగ్యానికి. టి.బి., కేన్సర్లను రానీయ దంట అందుకే ఇక్కడ రోజు కొద్దిసేపు..” అనేవాడు.
ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఆ దేవతకు పెట్టుకుంటాం. అంతేకాదు, పంట తయారు కాగానే నాన్న ఒక కోడిపుంజును కోసి, ఆ కోడి నెత్తురును పొలం మీద చల్లుతాడు. దాని తలకాయ, కాళ్ళని వేప చెట్టుకు కడతాం. మా పిల్లి వెళ్లి ఆ తలకాయ కాళ్ళని శుభ్రంగా భోంచేస్తుంది. ఎల్లమ్మ తల్లి అంటే మా చుట్టుపక్కల పొలాల వాళ్ళకి కూడా ఎంతో భక్తి . వాళ్లూ కోళ్ళను కోస్తారు. అందు వల్ల దిగుబడి బాగా వస్తుందని రైతుల నమ్మకం. ఆ ఎల్లమ్మ చెట్టు మీద కాకులు కొంగలు, గోరువంకలు అనేకం గూళ్లు కట్టుకొని కాపురాలు చేస్తుంటాయి. ప్రతి రోజూ తెల్లవారుజామున ఆ చెట్టు మీద నుంచి కాకులు కావు… కావు… మని గోలగోలగా అరుస్తుంటాయి. వాటి అరుపులతో మా బజారు వాళ్ళంతా మేలుకుని, ఆడవాళ్ళు ఊకి చల్లడం, మగవాళ్ళు పొలానికి పోవడం చేస్తుంటారు. సాయంత్రం కాస్త మసక చీకటి కమ్మే వేళకు ఎక్కడెక్కడో తిరిగిన పక్షులన్నీ ఆ చెట్టు మీదకు చేరుకుంటాయి. అవి గోలగోలగా అరుస్తూ పోట్లాడుకుంటుంటాయి. నాకైతే, వాటి అరుపులకు మెలకువ వచ్చి చిరాకేస్తుంది. ”ఇంకా ఎంత సేపు పడుకుంటావురా. లేచి చదువుకో” అని తాతయ్య అదిలింపులు మొదలవుతాయి. ఇంక లేవక తప్పదని, లేస్తాను పక్క మీద నుంచి. నిద్ర కళ్ళతోనే పుస్తకం పడతాను.
చాలా సార్లు మా పిల్లి రహస్యంగా వేప చెట్టు ఎక్కి, దాని మీద వాలే పిట్టల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. ఎప్పుడూ దొరక లేదు. కానీ ఓ సారి ఓ ఊర పిచ్చుక దొరికింది దాని నోటికి. సంతోషంగా పట్టుకొని వచ్చి, మా నడిమింట్లో పెట్టి, కొద్దిసేపు ఆడుకున్నాక తిందామనుకుంది. అది ఎలకను పట్టుకున్నప్పుడల్లా, అలాగే నోటితో పట్టుకుని వచ్చి ఇంట్లో పెడుతుంది. దాన్ని వదిలేసి, అది భయంతో పరిగెత్తగానే, దాని మీదకు దూకి కాళ్లతో అదిమి పట్టి నోటితో పట్టుకుంటుంది. మళ్ళీ వదిలి పెడుతుంది. పట్టుకుంటుంది. అలా కొద్ది సేపు ఆడుకున్నాక ఎలుకను శుభ్రంగా భోంచేస్తుంది. అలాగే ఊర పిచ్చుకతో కూడా ఆడాలనుకుంది. కాళ్ల మధ్యనున్న పిట్టను వదిలిపెట్టగానే, అది బుర్రుమని ఎగిరిపోయింది. మా పిల్లి వెర్రి మొఖం వేసి, పిట్ట వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది .
మా నాయనమ్మ మా గ్రామంలో డిగ్రీ లేని డాక్టర్‌. ఎవరికే అనారోగ్యాలు కలిగినా ముందు నానమ్మ దగ్గరికే వస్తారు. విరోచనాలు అవుతుంటే, మా ఇంట్లో ఉన్న ఆరె చెట్టుకు ఉన్న చెక్కను దంచి రసం తీసి పెరుగుతో తినమని చెబుతుంది. అలా ఎందరికో విరోచనాలు నయమయ్యాయి. తమ్ముడికి నడుం వద్ద పెద్ద కంచర అయింది. వేపాకు దంచి, కంచర మీద దట్టంగా రాసి, అర్ధగంట ఆరాక వేడి నీటితో స్నానం చేయించింది. అలా నాలుగు రోజులు చేయగా గాయం మానుపుండు పడింది. ఒక్కటని కాదు, ఇంటి పక్క నరేశ్‌ మలంలో పురుగులు పడుతున్నాయని, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినప్పుడు, వేప రసం చేసి తాగమని ఇచ్చింది. పురుగులు అన్ని పడిపోయాయని రాములమ్మ వచ్చి చెప్పింది. ‘మట్టి తింటే పురుగులు పడతాయిరా. ఏమన్నా తినాలనిపించినప్పుడు నా దగ్గరకు రా. మా ఇంట్లో వేయించిన కందులు, పెసలు ఉంటాయి. అవి పెడతాను తిందువు’ అని చెప్పింది. కానీ వాడు వచ్చేవాడు కాదు. డబ్బా కొట్ల వెంట నూగు జీడీలు, బొంగుండలు కొనుక్కొని తినేవాడు. మా పక్క పొలం పాపయ్య కూతురుకు పేనుకొరికి, సగం నెత్తి గుండైంది. నాయనమ్మ చెప్పిన చిట్కా వైద్యంతో అమ్మాయి కురులు, మళ్ళీ దట్టంగా పెరిగాయి నిగనిగ లాడుతూ. పేనుకొరుకుడు పోవడంతో వెంటనే సంబంధం కుదిరింది. అత్తగారింటికి వెళ్ళేప్పుడు వచ్చి, పాదాలకు నమస్కరించి వెళ్లింది. ఇలాంటివి నాయనమ్మ డెబ్బై రెండేళ్ల జీవితంలో ఎన్నో…
మా తాతకు మధుమేహం ఉంది. మా నాయనమ్మ వేపాకును ఉండలు చేసి రోజు ఒక ఉండను పచ్చిపాలతో మింగించేది. దీనితో షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుండేది. తాతయ్య అప్పుడప్పుడు బూరెలు, ఇంట్లో పెట్టిన స్వీట్లు నాయనమ్మ చూడకుండా తినేవాడు. చూస్తే చివాట్లు పెడుతుందని. కానీ, ఎలాగో తెలిసేది. తాతయ్య తల వాచి పోయేది.
మా ఇంటి పక్కన కనకయ్య, వాస్తు పరంగా వేపచెట్టు సరైన చోటులో లేదని, సిద్ధాంతి చెప్పాడని పెద్ద చెట్టును కొట్టి వేశాడు. నాన్న ఆ చెట్టుకున్న వేపపుల్లలు విరుచుకున్నాడు. రోజూ వేపపుల్ల వేసుకొని, పొలంలోకి వెళ్లి బొంగలుదొక్కటం, గండ్లు ఉంటే పూడ్చడం చేసేవాడు. నోరూ శుభ్రమయ్యేది ఆ సమయంలో. ఆ రోజు వేపచెట్టు కొమ్మలని విడిగా తీసి, కొమ్మలకున్న ఆకునంతా బస్తాలకు దూశాడు. అది ఎండగానే, బురద పొలంలో దాన్ని చల్లాడు. ఎందుకలా చేశావని నాన్నని అడిగాను. ”మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది రా. క్రిమి సంహారి కూడా” అన్నాడు. అంతేకాదు, ఎండాకాలంలో అన్నయ్యకు, నాకు చెరో ఖాళీ ఎరువుల బస్తా ఇచ్చి, వేపకాయలు ఏరుకొని రమ్మన్నాడు. అమ్మా నాన్న కూడా వేపకాయలని ఏరారు. ఊరు పక్కనే ఉన్న సీతారామారావు గారి పన్నెండు ఎకరాల తోట చుట్టూ వేపచెట్లు చాలా ఉన్నాయి. ఎండాకాలం వేపకాయలు కాసి, నేలపట్టనట్లు కింద రాలుతాయి. మేం ఏరిన వేపకాయలు బస్తాల్లో నింపి, నాన్న పెరట్లో నిలవ చేశాడు. పొలం కరిగట్టుకు ముందు, మెత్తగా దంచి పొలంలో చల్లాడు. రోగాలు రావు. దిగుబడి పెరుగుతుందన్నాడు . నిజంగా ఆ ఏడాది ఎక్కువే దిగుబడి వచ్చింది.
మా అన్నయ్యకు ఒకసారి చేలో కాలికి రాయి తగిలి పెద్ద గాయమైంది. పట్నం వెళ్ళి వైద్యం చేయించాలి అన్నాడు నాన్న. ”వద్దురా నేను నయం చేస్తాగా” అని నాయనమ్మ, గాయాన్ని శుభ్రంగా కడిగి వేపాకు నూరి కట్టు కట్టింది. నాయనమ్మ చేతి మహత్యమో, అన్నయ్య దృఢకాయుడు కావడం వల్లనో గాయం ఇరవై రోజుల్లోనే శుభ్రంగా మానిపోయింది. ఉగాది నాడు చాలామంది వచ్చి, వేప ప్రసాదం తయారు చేయడానికి మా వేప చెట్టుకున్న పూతను కోసుకొని పోతారు. నెలకోసారి నాయనమ్మ, చిన్నవేపాకు ఉండలు చేసి నాతో మింగిస్తుంది. ”కడుపులో పేగులన్నీ శుభ్రమైతాయి రా. ఎటువంటి చెత్త చెదారం నిలువ ఉండదు” అని చెప్పేది.
మా ఊరి బోనాల పండుగకు, అమ్మ నైవేద్యం వండి, ఆ కుండకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి, చుట్టూ వేప మండలు కట్టి, ఊరిలోని ముత్యాలమ్మ గుడి దగ్గరికి నైవేద్యం తీసుకెళుతుంది. శ్రావణమాసంలో గ్రామ దేవతలకు పెట్టాలనుకున్నప్పుడు, మేకపోతు మెడలో వేపాకు కట్టిన దండలే వేస్తారు. మాదిగలు డప్పు చప్పుళ్ళు చేస్తూ, బైండ్ల వాళ్ళు కొమ్ముబూరలు ఊదుతూ పోతును ఊరేగిస్తుంటే, పిల్లలమైన మేం ఆనందంగా దాని వెంట తిరుగు తుంటాం. మా వేప చెట్టు కింద అప్పుడప్పుడు, జంగాలు, గంగిరెద్దుల వాళ్ళు కుల పంచాయతీలు చేసుకుంటూ ఉండేవారు. ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణాలు చేపించేవారు. ఆ పంచాయతీలు జరిగినన్ని రోజులు మా ఇంటిదాకా కల్లు, సారా వాసన బాగా వచ్చేది.
ఒకసారి మియాసాబనే చెట్లను కొని, కోసి అమ్మే వర్తకుడు వచ్చి, ”మీ వేపచెట్టును కొంటాను. అమ్ముతావా సుబ్బన్నా ..? తలుపు చెక్కలకు దర్వాజాలకు బాగా పనికొస్తుంది” అన్నాడు నా ముందే.
”అది ఎల్లమ్మ చెట్టు. అంటే ఎల్లరకు అమ్మే. మాకు కులదేవత. మమ్మల్ని కాచి రక్షించేది ఆ మహాతల్లే. కన్నతల్లిని, దైవాన్ని ఎవరైనా అమ్ముకుంటారా…?” అని ప్రశ్నించాడు. దీనితో ఆ వ్యాపారి, తిరుగు మాట్లాడకుండా తలవంచుకొని వెళ్ళిపోయాడు.
ఇంత గొప్ప చెట్టు కనుకనే ఐక్యరాజ్యసమితి వారు వేప చెట్టును 21వ శతాబ్దపు చెట్టుగా ప్రకటించారు. దేశాదేశాల వాళ్ళు ఈ చెట్టుని విలువైనదిగా గుర్తించి, జాగ్రత్తగా పెంచుతున్నారు. పండుగలప్పుడు మా ఇంటిల్లిపాది చెట్టు కిందకు చేరి, నైవేద్యం పెట్టి దండం పెడతాం. ఎల్లమ్మకు పెడుతున్నామో, వేప చెట్టుకు పెడుతున్నామో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

– పుప్పాల కృష్ణమూర్తి, 99123 59345

Spread the love