న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం పేమెంట్స్ విభాగంలో మళ్లీ చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వ ప్యానెల్ ఆమోదం తెలుపనుందని తెలుస్తోంది. పేటియం పేమెంట్‌లో రూ.50 కోట్లు (6 మిలియన్ డాలర్లు) పెట్టుబడులకు పొరుగు దేశంలోని ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ లభించాల్సి ఉందన్నారు. 2020లో ఇరు దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణ తర్వాత చైనా సంస్థల వ్యాపారాలపై భారత్ ఆంక్షలు విధించింది. మరోవైపు నిబంధనలు అతిక్రమించిన పేటియం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ చర్యలు తీసుకోవడంతో ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలోకి జారుకుంది. దీంతో పెట్టుబడుల కోసం మళ్లీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.