– విద్యతోనే ఉన్నతి సాధ్యం : బీసీ సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో పేద బడుగు బలహీనర్గాల హక్కుల కోసం పోరాడిన యోధురాలు చిట్యాల ఐలమ్మ.. తెలంగాణ ఆస్తి అని బీసీ సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఐలమ్మ వంటి వారి త్యాగాలను విస్మరించారని, తెలంగాణ రాష్ట్రంలో అధికారి కంగా జయంతిని జరుపుకుంటూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నా మన్నారు. ఐలమ్మ 128వ జయంతిని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రధాన వేదికపై తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 56 ప్రాంతాల్లో ఐలమ్మ విగ్రహాలను ప్రతిష్టించి ఆమె పోరాట చరిత్రను ముందు తరాలకు అందిస్తున్నామని తెలిపారు. వెనుకబడిన సామాజిక తరగతుల వారు వాస్తవానికి వెనుకబడ లేదని.. వెనక్కు నెట్టేశారని.. విద్యతోనే వారి ఉన్నతి సాధ్యమని అన్నారు. వృత్తి కులాల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆత్మగౌరవంతో జీవించేలా చాకలి వృత్తి చేసుకునే వారికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. ఉప్పల్ భగాయత్‌లో చాకలి ఆత్మగౌరవ భవనం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళ భరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. విద్యతోనే హక్కులు సాధించుకోవచ్చన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్యక్రమ చైర్మెన్ అక్కిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ నిర్వహణలో ఐలమ్మ జయంతి జరుపుకుంటున్నామని, 91 వేల చాకలి వృత్తి కుటుంబాలకు 250 యూనిట్స్ ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. చాకలి వృత్తి చేసుకొనే వారికి మోపెడ్ బైక్‌లు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. గోపి రజక మాట్లాడుతూ.. ఐలమ్మ విగ్రహం టాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని, చాకలి సామాజిక తరగతిని ఎస్సీ కులంలో చేర్చాలని కోరారు. పలువురు నాయకులు సభలో పాల్గొన్నారు.