ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి: సీఐటీయూ

నవతెలంగాణ – పెదవూర
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందర కార్మిక వర్గానికి ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పెద్దపురం మార్కెట్ యార్డులో రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేషంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేస్తామని,అర్హత కలిగినటువంటి రంగాలలో కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కార్మికుల హామీల గురించి ఆలోచించే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది కార్మికులు సంఘటితంగా,వివిధ స్కీముల్లో పనిచేస్తున్నారని వీరందరూ ప్రజలకు సేవలు అందించడం తో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.వీరి సమస్యలు పరిష్కరించడంలో ఏ ప్రభుత్వం వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలకు,కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ఈ రాష్ట్రంలో అమలు కాకుండా చూడాలని కోరారు. రాబోయే కాలంలో ప్రభుత్వం కార్మిక సమస్యల ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జనరల్ బాడీ మండల సమన్వయ కమిటీని 21 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కన్వీనర్ గా ఎస్ కె బషీర్, సభ్యులుగా లింగంపల్లి వెంకటమ్మ, సత్తెమ్మ, ప్రభాకర్, వెంకన్న, మల్లేష్, లచ్చు, అంజి, ఎండి నూర్జహాన్, సిహెచ్ దుర్గయ్య, నాగమణి, దుబ్బ కృష్ణ, అనురాధ, తరిబిక్షం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల నాయకులు తరి రామకృష్ణ, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

Spread the love