– 3-0 విజయంపై భారత్ గురి
– ఊరట కోసం ఇంగ్లాండ్ ఆరాటం
– అహ్మదాబాద్‌లో నేడు ఆఖరు వన్డే పోరు
– మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
భారత్, ఇంగ్లాండ్ సమరం అంచనాలకు భిన్నంగా సాగింది. పొట్టి ఫార్మాట్‌లో ఊహించినట్టుగా పరుగుల వరద పారలేదు. వన్డే ఫార్మాట్‌లోనూ అంచనా వేసినట్టుగా అమీతుమీ ఉత్కంఠ కనిపించలేదు. 3-0 క్లీన్‌స్వీప్ విజయంపై కన్నేసిన టీమ్ ఇండియా నేడు అహ్మదాబాద్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఏమాత్రం కలిసిరాని పరిస్థితుల్లో ఊరట విజయం కోసం ఇంగ్లాండ్ ఆరాటపడుతోంది. భారత్, ఇంగ్లాండ్ మూడో వన్డే నేడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఇరు జట్లు ఆడనున్న చివరి వన్డే మ్యాచ్ ఇదే.
నవతెలంగాణ-అహ్మదాబాద్
వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు ఏదీ కలిసి రాలేదు. స్పిన్ అనుకూల పిచ్‌లపై ఇంగ్లాండ్ పేసర్లను ఎంచుకుంది. వైవిధ్యంతో కూడిన భారత బౌలింగ్ దాడిని ఎదుర్కొని పరుగులు చేయటంలో ఇంగ్లీశ్ బ్యాటర్లు నిలకడగా విఫలం అయ్యారు. టీమ్ ఇండియా ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లో ప్రత్యర్థిపై స్పష్టమైన పైచేయి సాధించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముంగిట నామమాత్రపు మూడో వన్డేలో ప్రయోగాలు చేసేందుకు భారత్ సిద్ధపడుతుండగా… ఊరట విజయం వేటలో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుంటే చాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ కనిపిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ చివరి వన్డే పోరు నేడు.
అతడూ మెరిస్తే
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ మూడు లక్ష్యాలు పెట్టుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను టాప్ ఆర్డర్‌లో ప్రయోగించటం. సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావటం. యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా ప్రయోగించినా.. ఆశించిన ఫలితం రాలేదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ నాగ్‌పూర్‌లో విఫలమైనా.. కటక్‌లో కదనోత్సాహంతో రెచ్చిపోయాడు. అదిరే సెంచరీతో పరుగుల వేటలో దూసుకొచ్చాడు. ఇక మిగిలింది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్‌లోకి రావటమే. నాగ్‌పూర్‌లో గాయంతో దూరమైన విరాట్ కోహ్లి.. కటక్‌లో ఆడినా నిరాశపరిచాడు. చాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఆఖరు మ్యాచ్‌లోనైనా కోహ్లి పరుగుల వేట మొదలెడితే జట్టు మేనేజ్‌మెంట్‌కు ఊరట దక్కనుంది. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నారు. శుభ్‌మన్ సంప్రదాయ దూకుడు ప్రదర్శించగా.. అయ్యర్ ధనాధన్ జోరులోనే ఉన్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. హార్దిక్ పాండ్య బంతితో, బ్యాట్‌తో మెప్పిస్తున్నాడు. పేస్ బౌలర్లలో మహ్మద్ షమి ఫామ్ ఆందోళనగా ఉంది. అతడు ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రానాలలో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి నేడు విశ్రాంతి లభించే అవకాశం ఉంది.
ఊరట దక్కేనా?
భారత పర్యటనలో ఇంగ్లాండ్‌కు ఏదీ కలిసి రాలేదు. ఆ జట్టు వ్యూహాత్మక తప్పిదాలు ప్రణాళికబద్దంగా చేయటం ఆసక్తి రేపుతోంది. స్పిన్ పిచ్‌లపై ఇంగ్లాండ్ పేసర్లను ఎంచుకుంది. వికెట్ల వేటలో ఇది ఇంగ్లాండ్‌కు ప్రతికూల ఫలితాలు అందించింది. ఇక వైవిధ్యంతో కూడిన భారత బౌలింగ్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు చేయటంలో తడబాటుకు గురయ్యారు. పవర్‌ప్లేలో మెరుగ్గానే ఆడుతున్నా.. ఆ తర్వాత స్పిన్‌కు దాసోహం అవుతున్నారు. జో రూట్, హ్యారీ బ్రూక్, జోశ్ బట్లర్‌లు అంచనాలను అందుకోలేదు. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్‌లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచటంలో విఫలం అవుతున్నారు. బౌలింగ్ విభాగంలో ఆదిల్ రషీద్‌కు తోడుగా బ్యాటర్లపై ఒత్తిడి పెంచే బౌలర్ కరువయ్యాడు. లియాం లివింగ్‌స్టోన్, జో రూట్ పార్ట్ టైమ్ స్పిన్ భారత బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోతుంది. అయినా, ఇంగ్లాండ్ మరో స్పెషలిస్ట్ స్నిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవటం లేదు. నేడు అహ్మదాబాద్‌లోనూ పేసర్లతోనే ఆ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడైనా ఫలితం మారుతుందా? లేదంటే నాగ్‌పూర్, కటక్ తరహాలోనే పరాజయం తప్పదా? వేచి చూడాలి.
పిచ్, వాతావరణం
అహ్మదాబాద్‌లో బుధవారం అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత వాతావరణం ఉండనుంది. ఇక్కడ విజయానికి రాచమార్గం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయటమే. భారత్, ఇంగ్లాండ్ కెప్టెన్లకు ఈ సంగతి బాగా తెలుసు. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, మహ్మద్ షమి.
ఇంగ్లాండ్ : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), టామ్ బాంటన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోశ్ బట్లర్ (కెప్టెన్), లియాం లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సె, సకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్.